YSRCP-TDP: ఎన్నికల ప్రక్రియపై జగన్‌ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్‌ కౌంటర్‌!

ఎన్నికల ప్రక్రియపై వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ (YS Jagan) స్పందించారు. ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

Updated : 18 Jun 2024 11:39 IST

అమరావతి: ఎన్నికల ప్రక్రియపై వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ (YS Jagan) స్పందించారు. ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. జగన్‌ పెట్టిన పోస్టుపై తెదేపా (TDP) నేతలు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్‌ ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని సూచించారు. 

‘‘న్యాయం అందడమే కాదు.. అందజేసినట్లు కూడా కనిపించాలి. ప్రజాస్వామ్యం నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లు వాడుతున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టేందుకు మనం కూడా అదే దిశగా పయనించాలి’’ అని ఎక్స్‌ (ట్విటర్‌)లో జగన్‌ పేర్కొన్నారు. 

ఏపీ ఎలాన్‌ మస్క్‌లా జగన్‌: సోమిరెడ్డి

జగన్‌ ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఏపీ ఎలాన్‌ మస్క్‌లా జగన్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా?2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్‌ ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలి. ఆత్మస్తుతి, పరనింద మాని ఇకనైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని సోమిరెడ్డి అన్నారు.

మరో నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. ‘‘గత ఎన్నికల్లో వైకాపాకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా?.. మాకు 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా? పులివెందులలో రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలి. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఉప ఎన్నిక  నిర్వహించాలని అందరం ఈసీని కోరదాం. జగన్‌కు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో.. రాదో చూద్దాం. ఇకనైనా ఆయన చిలక జోస్యం ఆపాలి’’ అని వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని