TDP: బాబాయ్‌ హత్యకేసులో కాళ్లబేరం కోసమే దిల్లీకి జగన్‌: రామ్మోహన్‌ నాయుడు

ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ గురించి జగన్‌ దిల్లీ వెళ్లలేదని, బాబాయ్‌ హత్యకేసులో కాళ్ల బేరం కోసం దిల్లీ వెళ్లారని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు.

Published : 29 Mar 2023 18:00 IST

హైదరాబాద్‌: నారా లోకేశ్‌ పాదయాత్ర పూర్తయ్యే సమయానికి వైకాపా ఖాళీ అవుతుందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ గురించి సీఎం జగన్‌ దిల్లీ వెళ్లలేదని, బాబాయ్‌ హత్యకేసులో కాళ్ల బేరం కోసం వెళ్లారని ఆరోపించారు. తెలుగు జాతి పరువును దిల్లీలో తాకట్టు పెట్టేందుకే వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రపంచం గర్వపడేలా తెలుగుజాతిని నిలబెట్టే సత్తా తెదేపాలో ఉందన్నారు.

‘‘తెలంగాణ గాలిలో, నేలలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఏపీ, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే తెదేపాతోనే సాధ్యం. 1983లో ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు దూసుకెళ్లినట్టు.. తెలుగుదేశంపార్టీ దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ మాదిరి అమరావతికి పునాదులు చంద్రబాబుతోనే సాధ్యం. 2024లో తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు. తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలకే జగన్‌పై నమ్మకం లేదు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెదేపాను అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి వైనాట్‌ 175 అంటున్నారు. వైనాట్‌ పులివెందుల అని సవాల్‌ విసిరాం. జీవో 1 తెచ్చి తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తెదేపా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అని రామ్మోహన్‌ నాయుడు హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు