chandrababu: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై తెదేపా కీలక నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా తెదేపాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన

Published : 06 Mar 2022 01:28 IST

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా తెదేపాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమైన తెదేపా శాసనసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై తొలుత పార్టీలో చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్‌ సమావేశాలకు వెళ్లాలని, చర్చలో పాల్గొనాలని మాజీ మంత్రి, సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. దీంతో సీనియర్‌ నేతల సూచనల మేరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని నిర్ణయించారు.

ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు: అచ్చెన్నాయుడు

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెదేపా శాసనసభాపక్షం సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు.

‘‘శాసనసభకు రాకుండా పారిపోతున్నామని కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కీలక బిల్లులపై విపక్షాలతోనూ చర్చించేవాళ్లు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే శాసనసభ్యులందరి అభిప్రాయాలు తీసుకొని చర్చించాకే నిర్ణయం తీసుకుంటారు. గత మూడేళ్లలో ఇలాంటి పరిస్థితులు లేకపోవడమే కాకుండా విపక్ష సభ్యులకు చట్టసభల్లో అవమానాలు ఎదురయ్యాయి. అమరావతిపై తీర్పుతో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. అదే ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని సమస్యలను చట్టసభల్లో ప్రశ్నిస్తాం. సభలో విపక్ష సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇవ్వాలి. కొన్ని మీడియా ఛానెళ్లను ప్రభుత్వం బహిష్కరించడం తగదు. సభ ప్రసారాలకు అన్ని ఛానెళ్లను అనుమతించాలి’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని