MLC Elections: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌.. విజయానికి చేరువలో తెదేపా

ఏపీలోని 9 ఉమ్మడి జిల్లాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల(గ్రాడ్యుయేట్‌) ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Updated : 17 Mar 2023 23:02 IST

అమరావతి: ఏపీలోని 9 ఉమ్మడి జిల్లాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల(గ్రాడ్యుయేట్‌) ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెదేపా సత్తా చాటుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తెదేపా అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లోక్కింపు పూర్తయ్యింది. మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు 27,315 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  అభ్యర్థి విజయానికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 94,509 ఓట్లు పొందాల్సి ఉండగా.. చిరంజీవిరావుకు 82,958 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు, భాజపా అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కు 10,884 ఓట్లు పోలయ్యాయి. చిరంజీవిరావు విజయం సాధించేందుకు ఇంకా 11,551 ఓట్లు రావాల్సి ఉంది.  దీంతో అధికారులు ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. తక్కువ ఓట్లు వచ్చిన వారి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కలుపుతున్నారు. 

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో ఆధిక్యం సాధించడంపై తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు. నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తనకు మద్దతిచ్చారన్నారు. ప్రజలు తెదేపా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 

27,262 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి శ్రీకాంత్‌

తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొత్తం 7 రౌండ్లు పూర్తయ్యే సరికి తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ 27,262 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం ఏడు రౌండ్లలో శ్రీకాంత్‌కు 1,12,514 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి 85,252 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి 50శాతం ఓట్లు దాటక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

పశ్చిమ రాయలసీమలో వైకాపా స్వల్ప ఆధిక్యం

కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల(పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టభద్రుల స్థానానికి 49 మంది పోటీలో ఉన్నారు. పోలైన 2,45,576 ఓట్లను లెక్కించే ప్రక్రియ సాగుతోంది. 8వ రౌండ్‌ లెక్కింపు పూర్తయిన తర్వాత వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి 74,678 ఓట్లు, తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 73,229 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు చెల్లని ఓట్లు 15,104 గుర్తించారు. మొత్తం ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి 1,449 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్ల ద్వారా మొత్తం లెక్కించిన ఓట్లు 1, 92,018. ఎనిమిదో రౌండ్‌లో  వైకాపా అభ్యర్థి 67 ఓట్ల ఆధిక్యం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని