Andhra News: ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌: అచ్చెన్న

తెదేపా నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తెదేపా

Updated : 10 May 2022 12:46 IST

అమరావతి: తెదేపా నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జగన్‌ తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏ కేసులో, ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో పోలీసులు చెప్పకపోవడం అప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమని అచ్చెన్నాయుడు విమర్శించారు. మూడేళ్ల జగన్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చారని.. తెదేపా నేతల అక్రమ అరెస్ట్‌లు, అక్రమ నిర్భందాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. జగన్‌కు ప్రజలు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికి తప్ప.. విపక్ష నేతలపై కక్ష సాధింపులకు కాదన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి నారాయణ పట్ల పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రోజురోజుకూ జగన్‌ పాలన పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణే ఓ వైపు చెబుతుంటే.. ఇదే వ్యవహారంలో నారాయణను ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని.. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని అచ్చెన్న విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని