Vizag: అర్జీలకే దిక్కులేనప్పుడు ‘జగనన్నకు చెబుదాం’ ఎందుకు?: అయ్యన్న పాత్రుడు

విశాఖపట్నంలో భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని, వాటికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.

Published : 05 Jun 2023 18:11 IST

విశాఖ: విశాఖపట్నంలో భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని, వాటికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇప్పటి వరకు చేసిన అర్జీలకే దిక్కులేనప్పుడు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ఎందుకని నిలదీశారు. సిరిపురంలో వున్న క్రస్టియన్ సంస్థకు చెందిన సీబీసీఎన్సీ భూముల్లో 18 వేల చదరపు గజాల స్థలంలో తవ్వకాలు ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించారు.

‘‘3,600 గజాల స్థలం సాంఘిక సంక్షేమ విభాగానికి ఇచ్చారు. అక్కడ విపరీతంగా తవ్వుతున్నారు. దేని కోసమని అడిగితే అధికారులు నవ్వుతూ సమాధానం దాట వేస్తున్నారు. 2006 సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాను. ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా సదరు అధికారులకు కూడా తెలిపాను. భూమి ఎవరిది?ఎవరు తవ్వకాలు చేస్తున్నారో చెప్పాలని కోరాను. స్థలం ఎవరిదో తెలియకుండా ప్రైవేటు వారికి అపార్టుమెంట్‌లు కట్టడానికి ఎలా అనుమతులు ఇచ్చారో తెలియాలి’’  అని అయ్యన్న పాత్రుడు అన్నారు. 30 రోజుల్లో సమాధానం రావాలని లేదంటే అప్లేట్‌ అథారిటీకి వెళ్తామని చెప్పారు. అప్పటికీ ఇవ్వకపోతే.. ఇదే అంశంపై హైకోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు.

ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి అమానుషం..

తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి అమానుషమని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. నేతల ఇళ్ల మీదకు వెళ్లి దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో గొంతునొక్కే హక్కు ఎవరికీ లేదు. ప్రజలను దారుణంగా మోసం చేస్తుంటే ప్రశ్నించకూడదా? నా మీదే 14 కేసులు పెట్టారు. ప్రభుత్వ దౌర్జన్యాల వల్ల ప్రజల్లో తిరుగుబాటు వస్తోంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రులను సీబీఐ అరెస్టు చేయలేదా? అవినాష్‌ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు? గతంలో సీఎంలనే సీబీఐ అరెస్టు చేసింది. హత్య కేసుతో సంబంధమున్న వ్యక్తిని అరెస్టు చేయకపోవడం సిగ్గు చేటు. దీనికి హోం మంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలి. అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు కలయిక ప్రజల కోసమే అయ్యుండొచ్చు’’ అని అయ్యన్న అభిప్రాయపడ్డారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని