
‘ఆధారాలున్నాయి.. రాజీనామా చేయండి’
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం: మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు బెంజికారు ముమ్మాటికీ ఈఎస్ఐ నిందితుడు ఇచ్చిన లంచమేనని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇందులో మరో మాటకు తావులేదంటూ మరిన్ని ఆధారాలు బయటపెట్టారు. కారులో తిరుగుతున్న మంత్రి జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ కు సంబంధించిన వీడియో ఫుటేజిని మీడియాకు విడుదల చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... జులై 26 నుంచి ఈశ్వర్ అదే బెంజికారు వినియోగిస్తున్నారని తెలిపారు. బెంజికారు తీసుకున్నట్టు ఈశ్వర్ సామాజిక మాధ్యమంలో కూడా పెట్టుకున్నారని వివరించారు. దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని అవసరమైనప్పుడు వెల్లడిస్తానని చెప్పారు.
ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకుని నైతిక బాధ్యత వహించి బెంజికారు మంత్రి జయరాం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జయరాంను సీఎం జగన్ కాపాడుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. ఫొటోలతో సహా ఆధారాలు చూపించినప్పటికీ విచారణకు ఆదేశించకుండా ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ‘‘ఈఎస్ఐ కుంభకోణంపై నిన్న అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. కానీ, ఫిర్యాదు విషయమై 24 గంటల తర్వాత కూడా నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. మాజీ మంత్రి ఫిర్యాదు చేస్తేనే స్పందన లేదు... సామాన్యుల పరిస్థితి ఏంటి?’’ అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.