Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 02 Oct 2023 20:42 IST

పరవాడ: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు. తొలుత అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆయనను మంగళగిరి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మళ్లీ ప్లాన్ మార్చిన పోలీసులు.. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి కాకుండా నేరుగా హైవే మీదుగా గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు. ఈ కేసుల నుంచి తప్పకుండా బయటపడతానని బండారు స్పష్టం చేశారు. ధర్మం తప్పనిసరిగా గెలుస్తుందన్నారు.

అర్ధరాత్రి నుంచి హైడ్రామా

బండారు ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగింది. ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఆ క్రమంలోనే పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా నేతలు భారీగా బండారు ఇంటికి తరలివచ్చారు.

గేటు దూకి మరీ..

అర్ధరాత్రి తమ నాయకుడి ఇంటికి ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరమేంటని తెదేపా శ్రేణులు మండిపడ్డాయి. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఉద్రిక్తత కొనసాగింది. అయితే, బండారుకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చేందుకు.. పలువురు పోలీసులు గేటు దూకి మరీ ఇంట్లోకి వెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా కార్యకర్తలు, మహిళలు ఆందోళనకు దిగారు. మరోవైపు బండారు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని