3 రాజధానుల ఎఫెక్ట్‌.. బీటెక్‌ రవి రాజీనామా!

ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంపై తెదేపా తీవ్ర నిరసన వ్యక్తంచేస్తోంది......

Updated : 22 Nov 2021 12:31 IST

కడప: ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంపై తెదేపా తీవ్ర నిరసన వ్యక్తంచేస్తోంది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లుల ఆమోదానికి నిరసనగా తెదేపా నేత బీటెక్‌ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే.. ‘‘సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై గవర్నర్‌ సంతకం చేయడం అప్రజాస్వామికం.  శాసనమండలి ఈ బిల్లులను సెలెక్ట్‌ కమటీకి పంపినా.. అదే బిల్లులు తిరిగి మండలిలో ప్రవేశ పెట్టే ప్రయత్నం చేసినా ఆమోదం లభించలేదు.అలాంటి బిల్లులను గవర్నర్‌ ఆమోదించడాన్ని నేను అప్రజాస్వామిక చర్యగా భావిస్తున్నాను. నాడు రాష్ట్రవిభజన సమయంలో పార్లమెంట్‌లో చేసిన చట్టంలో అంశాలు నేటికీ మన రాష్ట్రానికి దక్కలేదు. నేడు చట్టసభ అయిన శాసనమండలికి దక్కిన ఈ ప్రాధాన్యానికి కలత చెందుతున్నా. ప్రాధాన్యత లేని చట్టసభల్లో ఉండటం అనవసరమని భావించి రాజీనామా చేస్తున్నా. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా. మండలి ఛైర్మన్‌కు సంబంధిత ఫార్మెట్‌లో రాజీనామా లేఖను పంపుతా’’ అని పేర్కొన్నారు. 

మరోవైపు, మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై అమరావతి ఐకాస నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గవర్నర్‌ తీరుకు నిరసనగా తుళ్లూరులో రైతులు ధర్నాకు దిగారు. గవర్నర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని