Ap News: జొన్నలగడ్డలో తెదేపా ధర్నా ఉద్రిక్తం .. చదలవాడకు అస్వస్థత

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో నరసరావుపేట  తెదేపా నేత ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది.

Published : 16 Jan 2022 03:23 IST

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. గురువారం రాత్రి జొన్నలగడ్డలో వైఎస్సార్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు మాయం చేశారు. దీంతో శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విగ్రహాన్ని మాయం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకుల ఫిర్యాదు మేరకు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన తెదేపా నేతలు అనిల్‌, రాజేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నరసరావుపేట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో విచారించకుండా ఎక్కడికో తీసుకెళ్లి విచారిస్తున్నారని తెదేపా నాయకులు జొన్నలగడ్డలో ఆందోళనకు దిగారు.

 వైకాపా నేతలే వైఎస్సార్‌ విగ్రహాన్ని మాయం చేసి తెదేపా నేతలపై అబాండాలు వేస్తున్నారని చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. తెదేపా శ్రేణులు గుంటూరు- కర్నూలు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. నరసరావుపేట గ్రామీణ పోలీసులు రంగంలోకి దిగి ధర్నా విరమించాలని తెదేపా నాయకులను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో  పోలీసులు బలవంతంగా తెదేపా నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య  తోపులాట జరిగింది. కార్యకర్తలను చెదరగొట్టి అరవిందబాబును బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తోపులాట జరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. పార్టీ శ్రేణులు వెంటనే  స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనిల్‌, రాజేశ్‌లను వెంటనే విడుదల చేయాలి, సీఎం డౌన్‌.. డౌన్‌.. అంటూ తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. అస్వస్థతకు గురైన అరవిందబాబును 108 వాహనంలో నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు 108 వాహనంపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వైకాపా కార్యకర్తలే రాళ్ల దాడి చేశారని తెదేపా నేతలు ఆరోపించారు.

అరవిందబాబుపై దాడిని ఖండించిన చంద్రబాబు

చదలవాడ అరవిందబాబుపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. అరవిందబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు. తెదేపా శ్రేణులపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అంబులెన్స్‌పైనా దాడికి దిగడం వైకాపా అరాచకానికి నిదర్శనమన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని