AP News: డాక్ట‌ర్ సుధాక‌ర్‌ది ప్ర‌భుత్వ హ‌త్యే: లోకేశ్‌

ఇటీవ‌ల గుండెపోటుతో చ‌నిపోయిన డాక్ట‌ర్ సుధాక‌ర్ కుటుంబ‌స‌భ్యుల‌ను తెదేపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Published : 25 May 2021 01:22 IST

వైద్యుడి కుటుంబాన్ని ప‌రామర్శించిన లోకేశ్‌

రూ. కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్

విశాఖ‌: ఇటీవ‌ల గుండెపోటుతో చ‌నిపోయిన డాక్ట‌ర్ సుధాక‌ర్ కుటుంబ‌స‌భ్యుల‌ను తెదేపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రామ‌ర్శించారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న సీత‌మ్మ‌ధార‌లోని సుధాక‌ర్ ఇంటికి వెళ్లి వైద్యుడి చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తే వేధిస్తారా? అని ప్ర‌శ్నించారు. వైద్యుల‌కు స‌రైన మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వ‌లేద‌ని నిర‌స‌న తెలిపినందుకు సుధాక‌ర్‌పై కేసులు పెట్టి మాన‌సిక‌ క్షోభ‌కు గురి చేశార‌న్నారు. నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన వ్య‌క్తి సుధాక‌ర్ అని కొనియాడారు. వైకాపా ప్ర‌భుత్వ వేధింపుల వ‌ల్లే వైద్యుడు మృతిచెందారన్నారు. ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యే అని ఆరోపించారు. సుధాక‌ర్ కుటుంబానికి రూ.కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని లోకేశ్‌ డిమాండ్ చేశారు. బ‌డుగుల‌ను వేధించడం ఇక్కడితో ఆప‌క‌పోతే అధికార వైకాపా త‌గిన బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు. తన కుమారుడి మృతికి న‌ర్సీప‌ట్నం, పెందుర్తి ఎమ్మెల్యేలే కార‌ణమని.. వేధించి పొట్ట‌న బెట్టుకున్నారని డాక్టర్ సుధాకర్‌ తల్లి కావేరి బాయి ఆరోపించారు. తన ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ న్యాయం కోసం పోరాటం చేస్తానని చెప్పారు. 

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు సుధాకర్‌(52) గ‌త శుక్ర‌వారం గుండెపోటుతో మృతిచెందిన విష‌యం తెలిసిందే.  ఆసుపత్రిలో గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని గతంలో ఆయ‌న ఆరోపణలు చేశారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని కొద్ది రోజులు విశాఖలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైద్యుడిని స‌స్పెండ్ చేయ‌డంపై బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును న్యాయస్థానం సీబీఐకి అప్పగించడంతో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విష‌యం తెలిసిందే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని