YSRCP: ‘వైకాపా వారికి ఉద్యోగాలిచ్చేందుకు ఓ కార్పొరేషన్‌.. ఐ డ్రీమ్‌ ఛానల్‌ యజమాని ఛైర్మన్‌’

వైకాపా వారికి ఉద్యోగాలిచ్చేందుకు గత ప్రభుత్వం ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీఎల్‌) పేరుతో ఓ కార్పొరేషన్‌నే ఏర్పాటు చేసిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం   విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 25 Jun 2024 07:14 IST

జగన్‌ ప్రచార పిచ్చికి రూ.500 కోట్ల ప్రజాధనాన్ని తగలేశారు 
తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ 

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా వారికి ఉద్యోగాలిచ్చేందుకు గత ప్రభుత్వం ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీఎల్‌) పేరుతో ఓ కార్పొరేషన్‌నే ఏర్పాటు చేసిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం   విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ‘ఐ డ్రీమ్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ యజమానిని దానికి ఛైర్మన్‌ను చేశారని పేర్కొన్నారు. ఆ సంస్థ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారికి, వారి ఇళ్లలో పనులు చేసేవారికీ కార్పొరేషన్‌ నుంచే జీతాలు చెల్లించారని దుయ్యబట్టారు. ఇలా ఒక్కొక్కరూ పదిమందికి తక్కువ కాకుండా తమ వారికి ఏపీడీసీఎల్‌లో ఉద్యోగాలిచ్చారన్నారు. ఇలా అయిదేళ్లలో సుమారు రూ.500 కోట్ల ప్రజాధనాన్ని మాజీ సీఎం జగన్‌ తన ప్రచారం కోసం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కార్పొరేషన్‌లోని 129 మంది ఉద్యోగుల్లో 49 మంది కార్యాలయానికే రాకుండానే జీతాలు తీసుకున్నారు. పల్లెలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం, డిజిటల్‌ లైబ్రరీ సౌకర్యం కల్పించాల్సిన ఏపీడీసీఎల్‌ను వైకాపా నేతలు తమ జేబు సంస్థగా మార్చుకున్నారు. కపుల్‌ పాలసీ అని పెట్టి.. భార్యాభర్తలకు కలిపి ఉద్యోగాలిచ్చారు. భర్త ఉద్యోగానికి వస్తే.. భార్య రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కొక్కరికి నెలకు రూ.70 వేల నుంచి రూ.లక్ష చొప్పున జీతాలు చెల్లించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సాక్షి పత్రిక మాదిరిగా డిజిటల్‌ కార్పొరేషన్‌ను ఉపయోగించుకున్నారు.

గతంలో లోకేశ్‌పై విషప్రచారం చేసిన రవికిరణ్‌ లాంటి వారు, వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో పనిచేసే వాళ్లు ఇందులో ఉన్నారు. వారు ప్రభుత్వ ప్రచారం ముసుగులో జగన్‌ వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచడానికి పనిచేశారు. వైకాపాకు అనుకూలంగా పనిచేసే సుమారు 500 యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లకు గూగుల్‌ యాడ్స్‌ ఇచ్చారు. ‘ఐ ప్యాక్‌’కు కూడా చెల్లింపులు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే వీరిలో చాలామంది జారుకున్నారు’ అని వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ చేయాలని, ప్రజాధనాన్ని దోచుకున్న వైకాపా నేతలు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజయ్‌కుమార్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని