TDP: ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?

పోలింగ్‌ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్‌ను తెదేపా నేతలు ప్రశ్నించారు.

Published : 05 Jul 2024 04:58 IST

30 కేసులున్న జగన్‌ దృష్టిలో.. 14 కేసులున్న పిన్నెల్లి సౌమ్యుడే
జగన్‌పై తెదేపా నేతల మండిపాటు 

ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగ్‌ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్‌ను తెదేపా నేతలు ప్రశ్నించారు. నెల్లూరు జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్‌ అనంతరం జగన్‌ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. చేసిన పాపాలకు త్వరలోనే జగన్‌ కూడా జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తదితరులు గురువారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కులం, ప్రాంతం, పార్టీలకతీతంగా పాలన చేశామని చెప్పే జగన్‌.. కక్ష సాధింపుల్లో మాత్రమే సమానత్వం పాటించారు. అమరరాజ కంపెనీ, సంగం డెయిరీ, రామోజీరావు, రఘురామకృష్ణరాజు, అచ్చెన్నాయుడు చివరకు చంద్రబాబును కూడా వదలిపెట్టకుండా అందరినీ వేధించారు. చిన్నరాయి కారణంగా సీఐ తల పగిలిందని చెప్పిన జగన్‌.. తన భుజంపై బఠానీ గింజంత గాయమైతే దళితుడైన శీనును ఐదేళ్లు జైల్లో ఉంచలేదా? తనపై చిన్న గులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో పిన్నెల్లిని ఉంచిన జైల్లోనే పెట్టించలేదా? సీఎంగా చేసిన వ్యక్తి.. ఈవీఎం పగలకొడితే తప్పేంటని ప్రశ్నిస్తారా? ఎన్నికల ప్రక్రియపై జగన్‌కు కనీసం గౌరవం ఉందా?’ అని వారు ప్రశ్నించారు. జగన్‌ అండతోనే పిన్నెల్లి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని మండిపడ్డారు.

  • మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో స్పందించారు. ‘పిన్నెల్లి మంచివాడు, సౌమ్యుడు అని జగన్‌ చెప్పడం సిగ్గుచేటు. కుల, మత, ప్రాంతాలేవీ చూడమని చెప్పిన జగన్‌కు 11 సీట్లే ఎందుకొచ్చాయో ఆత్మవిమర్శ చేసుకోవాల’ని పేర్కొన్నారు. 
  • అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ ‘బీసీ నాయకుడు చంద్రయ్యను నడిరోడ్డుపై గొడ్డలితో పిన్నెల్లి నరికించారు. 20 ఏళ్లుగా మాచర్లలో పిన్నెల్లిపై 14 కేసులున్నాయి. నరహంతకుడు, కబ్జాదారును సౌమ్యుడు, మంచివాడుగా జగన్‌ కీర్తించడం సిగ్గుచేటు. 30 కేసులున్న జగన్‌కు 14 కేసులున్న రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కన్పించడంలో ఆశ్చర్యం లేద’ని ఎద్దేవాచేశారు.

గొడవలు సృష్టించాలనే ములాఖత్‌కు అనుమతి కోరారు: హోంమంత్రి అనిత 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గొడవలు సృష్టించాలనే దురుద్దేశంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్‌కు మాజీ సీఎం జగన్‌ అనుమతి కోరారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. నిబంధనల ప్రకారం పిన్నెల్లికి ఇవ్వాల్సిన ములాఖత్‌లన్నీ అయిపోయాయని, అనుమతించే అవకాశం లేదని తెలిసీ జగన్‌ దరఖాస్తు చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతోనే జగన్‌కు అవకాశం ఇచ్చామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈవీఎంలను ధ్వంసం చేసి, పోలీస్‌ అధికారిపై హత్యకు యత్నించిన నిందితుడిని పరామర్శించేందుకు జగన్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు వెళ్లారు. బయటకొచ్చి ఏదేదో మాట్లాడారు. వైకాపా హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినా, వారి కుటుంబ సభ్యులకు మూడో ములాఖత్‌ ఇవ్వలేదు’ అని అనిత గుర్తుచేశారు.

ములాఖత్‌కు రూ. 25 లక్షలు పెట్టి  హెలికాప్టర్‌లో వెళ్లిన పెత్తందారు: లోకేశ్‌

ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చడానికి రూ.25 లక్షలు ఖర్చు చేసి మరీ హెలికాప్టర్‌లో వెళ్లిన పెత్తందారు.. పల్నాడులో తెదేపా కార్యకర్త చంద్రయ్యను చంపిందెవరో చెప్పాలని మంత్రి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. పిన్నెల్లితో ములాఖత్‌ తర్వాత జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌లో లోకేశ్‌ స్పందించారు. ‘డాక్టర్‌ సుధాకర్‌ను చంపిందెవరు? ప్రజావేదికను కూల్చిందెవరు? బీసీ బిడ్డ అమర్‌నాథ్‌గౌడ్‌ను హత్య చేసిందెవరు? ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి కారకులెవరు? అబ్దుల్‌ సలాం కుటుంబాన్ని వేధించి చంపిందెవరు?’ అని ప్రశ్నలు కురిపించారు.

పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి ఈవీఎం పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జగన్‌ వంతపాడడం సిగ్గుచేటని రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి విమర్శించారు. ‘వైకాపా పాలనలో పిన్నెల్లి మారణ హోమం సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాచర్లకు వెళ్లిన తెదేపా నాయకులు బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై బహిరంగంగా హత్యాయత్నం చేసినా చర్యలు తీసుకోలేద’ని గుర్తు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు