Gudivada: గుడివాడ నుంచి కొడాలి నానిని తరిమికొడతాం: రావి వెంకటేశ్వరరావు

పోలీసుల ఆంక్షల మధ్యే గుడివాడలో తెదేపా, జనసేన నేతలు వంగవీటి మోహన రంగా విగ్రహానికి నివాళులర్పించారు. రంగా వర్ధంతి సందర్భంగా ఏజీకే స్కూలు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి తెదేపా ఇన్‌ఛార్జ్‌ రావి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పూలమాలలు వేశారు. 

Updated : 26 Dec 2022 16:52 IST

పోలీసుల ఆంక్షల నడుమే రంగాకు తెదేపా, జనసేన నేతల నివాళులు

గుడివాడ: పోలీసుల ఆంక్షల మధ్యే గుడివాడలో తెదేపా, జనసేన నేతలు వంగవీటి మోహన రంగా విగ్రహానికి నివాళులర్పించారు. రంగా వర్ధంతి సందర్భంగా ఏజీకే స్కూలు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి తెదేపా ఇన్‌ఛార్జ్‌ రావి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పూలమాలలు వేశారు.

అనంతరం రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిపై మండిపడ్డారు.  ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో తమ పార్టీ నేతలపై పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరింది కొడాలి నాని మనుషులేనని ఆరోపించారు. గత 25 ఏళ్లుగా గుడివాడలో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తుంటే ఇప్పుడు వైకాపా నేతలు అడ్డుకునేందుకు యత్నించారని ఆయన మండిపడ్డారు. రంగా ఏ ఒక్క సామాజికవర్గానికో చెందిన వ్యక్తి కాదని.. అందరివాడని కొనియాడారు. రౌడీయిజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా అని కొనియాడారు. కొడాలి నాని రూ.5వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. ఆయన్ను గుడివాడ నుంచి తరిమి కొడతామని చెప్పారు. పట్టణంలో రౌడీయిజాన్ని అంతం చేస్తామన్నారు. 

ఇటు తెదేపా, అటు వైకాపా నేతలు రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో సోమవారం ఉదయం నుంచి గుడివాడలో ఉత్కంఠ కొనసాగింది. తెదేపా కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసుల ఆంక్షల నడుమే తెదేపా నేతలు ఏజీకే స్కూలు వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు శరత్‌ టాకీస్‌ వద్ద వైకాపా నేతలు రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. ప్రజలు గుంపులుగా ఉండకూడదంటూ చెదరగొడుతున్నారు. పట్టణలో ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతి నిరాకరించారు. 

గుడివాడలో ఆంక్షలు ఎందుకు?.. ఏం జరిగింది?

గుడివాడలో సోమవారం వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు తెదేపా నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుడైన కాళీ ఆదివారం సాయంత్రం 6.15 గంటల సమయంలో తెదేపా గుడివాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేశారు. రంగా వర్ధంతి నిర్వహించొద్దని హెచ్చరించారు. అది చెప్పటానికి నువ్వెవరంటూ రావి వెంకటేశ్వరరావు గట్టిగా ప్రశ్నించారు. ‘ఎక్కువ మాట్లాడితే నిన్ను లేపేస్తా’ అని కాళీ ఆయన్ను తీవ్ర స్వరంతో బెదిరించి, అసభ్యపదజాలంతో దుర్బాషలాడారు. 

విషయం తెలుసుకున్న రావి వర్గీయులు పెద్ద సంఖ్యలో తెదేపా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాళీ ఇంటికెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు తెదేపా కార్యాలయం వద్దకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో కాళీ వైకాపా నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని తెదేపా కార్యాలయంపైకి దూసుకొచ్చారు. తెదేపా శ్రేణులపైకి పెట్రోలు ప్యాకెట్లు విసిరి నిప్పు అంటించేందుకు యత్నించారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. దీంతో తెదేపా శ్రేణులు ప్రతిఘటించాయి. వీడియోలు, ఫొటోలు తీస్తున్న విలేకర్లపైనా వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. కర్రలతో కొట్టారు. దీంతో అయిదుగురు విలేకర్లు గాయపడ్డారు. 

వైకాపా నాయకులు, శ్రేణులు దాడులు చేస్తుంటే.. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాళీ, వైకాపా కార్యకర్తలు.. పోలీసులను నెట్టేసి మరీ తెదేపా శ్రేణులపై దాడులు చేస్తున్నా చూసీచూడనట్లు ఉన్నారు. తెదేపా కార్యాలయం వద్ద ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెదేపా శ్రేణులపై లాఠీఛార్జి చేశారు. వైకాపా నాయకులను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో గుడివాడలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాలపై ఉత్కంఠ ఏర్పడింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని