TDP-Mahanadu: పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది రాష్ట్రం పరిస్థితి: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభమైంది.

Updated : 27 May 2023 13:47 IST

రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం మొత్తం పసుపుమయంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మహానాడుకు భారీగా హాజరయ్యారు. మహానాడులో భాగంగా తొలిరోజైన ఇవాళ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. మరో 35 వేల మంది వరకూ కార్యకర్తలు వస్తారని అంచనా. కార్యక్రమానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు మొదటగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో ‘మహానాడు’లను చూశాను. కానీ, ఇంతకుముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇవాళ చూస్తున్నాను. ఎన్టీఆర్‌ శత జయంతిని ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంత గొప్పగా శతజయంతిని చేశాం. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుంది. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

₹2వేల నోట్లన్నీ జగన్‌ దగ్గరే ఉన్నాయి

వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఓ కురుక్షేత్ర సంగ్రామం. కౌరవుల్ని ఓడించి మళ్లీ గౌరవ సభ నిర్మిద్దాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్‌ సిద్ధంగా ఉంది. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఆ రాయి పేదలకు తగలకుండా అడ్డం పడతాం. పేదల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో తెదేపాకు తెలుసు. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం. స్కాముల్లో మాస్టర్‌ మైండ్‌ జగన్‌. ₹2వేల నోట్లన్నీ జగన్‌ దగ్గరే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అవన్నీ డ్రామాలే..

‘‘వైకాపా విధ్వంసం సమాజానికే పెను ప్రమాదంగా మారింది. ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ ఓట్లు వేయించుకున్నారు. దేశంలోనే పేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీ. అందరు సీఎంల కంటే ధనిక ముఖ్యమంత్రి జగన్‌. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువే. స్కాముల్లో మాస్టర్‌ మైండ్‌ జగన్‌. నాలుగేళ్లలో జగన్‌ చేసిన అవినీతి రూ.2.27 లక్షల కోట్లు.  3 రాజధానులంటూ.. అసలు రాజధానే లేకుండా చేశారు. కోడికత్తి డ్రామా.. మద్య నిషేదం వంటివన్నీ డ్రామాలే. ’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని