Chandrababu Arrest: మా నేతను అక్రమంగా అరెస్టు చేశారు.. లోక్‌సభలో గల్లా జయదేవ్‌

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంటులో ప్రస్తావించారు.

Updated : 19 Sep 2023 06:18 IST

దిల్లీ: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టు అంశాన్ని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌(Galla Jayadev) పార్లమెంటులో ప్రస్తావించారు. తమ పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారని లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ నిర్ధారణ కాకుండానే అరెస్టు చేశారన్నారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు చౌకబారు ఎత్తుగడలు వేశారు. స్కిల్‌ కేసులో రూ.371 కోట్లు విడుదల చేశారన్నది ప్రధాన ఆరోపణ. చంద్రబాబుకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలూ చూపలేదు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్టు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు ఆపేలా ప్రధాని చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి. చంద్రబాబు ఐటీని ప్రోత్సహించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. అనేక సంస్కరణలతో ప్రగతి సారథిగా నిలిచారు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్‌ డేగా నిలిచిపోయింది. ఏపీలో చట్టాలను తుంగలో తొక్కిన తీరును ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకొస్తున్నా. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టిపెట్టాలి’’ అని ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ కోరారు.  

రాష్ట్ర రాజధాని ఏమిటో ఇప్పటికీ ప్రజలకు తెలీదు..

‘‘ప్రతి ప్రభుత్వం దేశ అభివృద్ధికి పాటుపడాలని ప్రధాని చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని హామీలు ఇంకా నెరవేరాల్సి ఉంది. రాష్ట్రవిభజన సరిగా జరగలేదని ప్రధాని మోదీ ఉదయమే చెప్పారు. రాష్ట్ర రాజధాని విషయంలో ఇప్పటికీ గందరగోళం ఉంది. ఇప్పటికీ రాష్ట్ర రాజధాని ఏమిటో ప్రజలకు తెలియదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. ఇవ్వలేదు’’ అని గల్లా ఆవేదన వ్యక్తంచేశారు.

మరోవైపు,  గల్లా జయదేవ్‌ లేవనెత్తిన చంద్రబాబు అరెస్టు అంశంపై వైకాపా ఎంపీ మిథున్‌ రెడ్డి స్పందించారు. జయదేవ్‌ ఆరోపణలపై వివరణ ఇస్తానన్నారు. చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరిట రూ.371 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న ప్యానల్‌ స్పీకర్‌ కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడటం సరికాదన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని