Andhra News: నాటుసారా, జె బ్రాండ్‌ మద్యం నిషేధంపై ఏపీ వ్యాప్తంగా తెదేపా పోరు

ఏపీలో నాటు సారా, జె బ్రాండ్‌ మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆందోళనలకు దిగింది. మద్యపాన నిషేధం విధించాలంటూ

Updated : 19 Mar 2022 14:42 IST

అమరావతి: ఏపీలో నాటు సారా, జె బ్రాండ్‌ మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆందోళనలకు దిగింది. మద్యపాన నిషేధం విధించాలంటూ ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా గ్రామస్థాయి నుంచి ఆందోళనలు చేపట్టారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో..

నాసిరకం మద్యం తాగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట తొమ్మిది రకాలుగా నాసిరకం మద్యం అమ్మకాలకు తెర లేపారని మండిపడ్డారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మందుబాబుల ఇళ్లను సీఎం జగన్‌ దోచేస్తుున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో.. 

సారా మహమ్మారిపై నిరసన తెలియజేస్తున్న తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ర్యాలీగా వెళుతున్న తెదేపా శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

గుంటూరులో..

పాత గుంటూరు ఎన్టీఆర్‌ కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

కృష్ణా జిల్లా..

విజయవాడలో ప్రభుత్వ మద్యం దుకాణం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. నందిగామలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద తంగిరాల సౌమ్య ఆందోళకు దిగారు. ఈ సందర్భంగా మద్యం సీసాలు ధ్వంసం చేశారు.

తూ.గో.జిల్లా..

మోరంపూడి జంక్షన్‌ వద్ద తెదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. వీఎల్‌ పురం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసనలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని