TDP: పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి హాజరుకానున్న తెదేపా

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి తెదేపా హాజరుకానుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

Published : 25 May 2023 14:59 IST

అమరావతి: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి తెదేపా హాజరుకానుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28న పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమానికి రావాలంటూ అన్ని రాజకీయ పార్టీలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపారు. ఈ నేపథ్యంలో తెదేపా తరఫున హాజరుకావాల్సిందిగా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు చంద్రబాబు సూచించారు. 

పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్రపతి లేకుండా ఎలా ప్రారంభిస్తారని విపక్షాలు నిలదీస్తుండగా.. గతంలో పార్లమెంటులోని భవనాలకు ఇందిర, రాజీవ్‌లే ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారని భాజపా అంటోంది. ఈ కార్యక్రమానికి తాము హాజరు కాబోమంటూ 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా భాజపా సహా 14 ఎన్‌డీఏ పక్షాలు స్పందించాయి. విపక్షాలు ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తున్నాయంటూ ప్రకటన విడుదల చేశాయి. ఎన్‌డీఏ పక్షాలతోపాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. 

ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వైకాపా ఇప్పటికే వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేసే శుభప్రదమైన కార్యక్రమాన్ని బహిష్కరించడమనేది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అన్ని రాజకీయ పార్టీలూ ఈ అద్భుత వేడుకకు హాజరుకావాలని నా మనవి. మా పార్టీ ఈ చరిత్రాత్మక ఘట్టానికి హాజరవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని