MLC Election: వైకాపా కోటకు బీటలు.. పశ్చిమ రాయలసీమలో తెదేపా ఘన విజయం

MLC elections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి రామగోపాలరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Updated : 18 Mar 2023 21:04 IST

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా విజయదుందుబి మోగించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) ఫలితాలు నిన్న వెలువడగా.. పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురము-కర్నూలు) నియోజకవర్గం ఫలితం ఈరోజు రాత్రి వెల్లడైంది. వైకాపాకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రతి రౌండ్‌లోనూ తెదేపా(TDP), వైకాపా(YSRCP) బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోవడంతో..ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం 7,543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన తర్వాత భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని అధికారికంగా ధ్రువీకరరిస్తామని రిటర్నింగ్ అధికారి తెలిపారు. మరో వైపు ఓట్ల లెక్కింపులో సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని వైకాపా నేతలు ఆరోపించగా.. ఎన్నికల సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించారని తెదేపా నేతలు పేర్కొన్నారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం రాత్రి 8గంటల వరకు కొనసాగింది.

రీకౌంటింగ్‌కు పట్టుబట్టిన వైకాపా 

ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి, వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రీ కౌంటింగ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కౌంటింగ్‌ కేంద్రంలో కింద కూర్చుని నిరసన తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి నాగలక్ష్మి జోక్యం చేసుకుని  కౌంటింగ్‌ కేంద్రంలో ఎలాంటి ఆందోళనలు చేయవద్దని సూచించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని వైకాపా అభ్యర్థికి సర్దిచెప్పారు. కలెక్టర్‌ జోక్యంతో వైకాపా అభ్యర్థి ఆందోళన విరమించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం.. రిట్నరింగ్‌ అధికారి తుది ఫలితం వెల్లడించక ముందే రవీంద్రారెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, వైకాపా నేతలు కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లి పోయారు.

తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెదేపా శ్రేణుల్లో జోష్‌ నింపాయి. పట్టభద్రుల 3 స్థానాలు తెదేపా కైవసం చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లా తెదేపా కార్యాలయం వద్ద తెదేపా శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు.  అనంతపురం జిల్లాల్లో మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని