Teenmar Mallanna: బాధ్యతగా నడుచుకుంటా: తీన్మార్‌ మల్లన్న

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌ కుమార్‌)తో గురువారం శాసనమండలిలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు.

Published : 14 Jun 2024 04:43 IST

ఎమ్మెల్సీగా ప్రమాణం చేశాక తీన్మార్‌ మల్లన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి,
చిత్రంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ తదితరులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌ కుమార్‌)తో గురువారం శాసనమండలిలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, జైవీర్‌రెడ్డి, బాలూనాయక్, యశస్వినిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ తదితరులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తీన్మార్‌ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడం నా జీవితంలో మొదటి అవకాశం. ఇంతకుముందు నేను వార్డు సభ్యుడిగా కూడా గెలవలేదు. ఇప్పటివరకు ఉన్న తీన్మార్‌ మల్లన్న వేరు... ఇప్పుడు వేరు. ఇకపై బాధ్యత గల వ్యక్తిగా నడుచుకుంటా. పట్టభద్రుల కోటాలో నాకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీపా దాస్‌మున్షీ, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ‘ఇండియా’ కూటమి సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. నా గెలుపునకు కృషిచేసిన మా బృందానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’’ అని పేర్కొన్నారు.

నవీన్‌ కుమార్‌రెడ్డితో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయిస్తున్న మండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి,
చిత్రంలో డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, మాజీ మంత్రి సబితారెడ్డి తదితరులు 

అమరవీరులకు నా విజయం అంకితం: నవీన్‌కుమార్‌రెడ్డి 

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నవీన్‌ కుమార్‌రెడ్డి(భారాస)తో శాసనమండలిలో గురువారం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ప్రమాణం చేశాక నవీన్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ అమరవీరులకు నా విజయాన్ని అంకితం చేస్తున్నా. నాపై నమ్మకముంచి గెలిపించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే నన్ను గెలిపించిన ప్రజాప్రతినిధులు... పాలమూరు అంటే కేసీఆర్‌ అడ్డా అని మరోమారు నిరూపించారు’’ అని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని