ఎన్టీఏతో ప్రయాణం.. చిరాగ్‌ పునరాలోచించాలి!

లోక్‌జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో చెలరేగిన అంతఃకలహాల నేపథ్యంలో ఎన్డీయేలో కొనసాగడంపై చిరాగ్‌ పాశ్వాన్‌ పునరాలోచించుకోవాలని రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) నాయకుడు తేజశ్వి యాదవ్‌ పేర్కొన్నారు.

Published : 28 Jun 2021 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)లో చెలరేగిన అంతఃకలహాల నేపథ్యంలో ఎన్డీయేలో కొనసాగడంపై చిరాగ్‌ పాశ్వాన్‌ పునరాలోచించుకోవాలని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్‌ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఆదివారం ఇచ్చిన ముఖాముఖిలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్‌ వారసత్వాన్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం చేస్తున్న అస్తిత్వ పోరాటంలో చిరాగ్‌ భాగం కావాలని కోరారు.

ఎల్‌జేపీలో ఆధిపత్యం కోసం చిరాగ్‌ పాశ్వాన్‌, ఆయన బాబాయి పశుపతి కుమార్‌ పారస్‌ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా చూస్తున్న భాజపా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ తేజస్వి మండిపడ్డారు. భాజపా తన మిత్రపక్షాలను అవసరానికి వాడుకొని, అధికారం దక్కిన తర్వాత వదిలేస్తుందని ఆరోపించారు. 2009 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేక ఎల్‌జేపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తరుణంలో తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. రామ్‌ విలాస్ పాశ్వాన్‌ను ఆర్జేడీ కోటాలో రాజ్యసభకు పంపారని గుర్తు చేశారు. 

ఎల్జేపీలో తలెత్తిన సంక్షోభంలో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ హస్తం ఉన్నట్లు చిరాగ్ చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని తెలపాలని కోరగా.. తేజస్వి యాదవ్‌ ఘాటుగా స్పందించారు. చిరాగ్‌కు మద్దతు తెలుపుతూ నీతీశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2005, 2010ల్లో కుట్రపూరితంగా ఎల్‌జేపీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించినవారే తాజా కలహాలకు కారణమంటూ ఆరోపించారు. నీతీశ్‌ గత చరిత్ర చూస్తే ఈ అంశం తేటతెల్లమవుతుందంటూ ఘాటుగా విమర్శించారు. అధికారం కోసం విలువలను తుంగలోతొక్కే వ్యక్తిగా అయన్ను అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని