‘హస్తం’తో దోస్తీ బిహార్‌ వరకే: తేజస్వి 

కాంగ్రెస్‌ పార్టీతో తమ పొత్తు బిహార్‌ వరకే పరిమితమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ స్పష్టంచేశారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సోమవారం.....

Updated : 02 Mar 2021 12:55 IST

కోల్‌కతా: కాంగ్రెస్‌ పార్టీతో తమ పొత్తు బిహార్‌ వరకే పరిమితమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ స్పష్టంచేశారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సోమవారం ఆయన కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు అంశంపై ఇరువురు నేతలూ చర్చించినట్టు సమాచారం.  అనంతరం తేజస్వి యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో దీదీకి పూర్తి మద్దతు ఇవ్వాలని తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిర్ణయించారని తెలిపారు. లెఫ్ట్‌, కాంగ్రెస్‌తో పొత్తు బిహార్‌ వరకే పరిమితమని, బెంగాల్‌లో భాజపాను నిలువరించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మమతా బెనర్జీ వెనుక  ఉంటూ ఆమెను బలపరచడం తమ కర్తవ్యమన్నారు. దీదీని తామెప్పుడూ గౌరవిస్తామని, ఆమె సారథ్యంలోని తృణమూల్‌తో మంచి సంబంధాలు ఉన్నట్టు తెలిపారు. మతతత్వ అజెండాతో అధికారంలోకి వచ్చేందుకు భాజపా కలలు కంటోందని, అది జరగదన్నారు.  బెంగాల్‌లో ఉంటోన్న బిహార్‌ ప్రజలు తెలివిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భాజపా నేతలంతా తమ పనిని పక్కనబెట్టి బెంగాల్‌ బాట పడుతున్నారని తేజస్వీ యాదవ్‌ ఎద్దేవా చేశారు. మరోవైపు, లాలూ జైలు నుంచి బయటకు వస్తే బిహార్‌ ఎన్నికల్లో గెలవలేమని తెలిసే ఆయన్ను రానీయకుండా చేశారని మమత ఆరోపించారు. బిహార్‌ ఎన్నికల్లో భాజపా మోసాలకు పాల్పడిందన్నారు. తాను, తేజస్వీ పోరాడుతున్నామన్న మమత.. బెంగాల్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను ఎనిమిది విడతలుగా ప్రకటించడంపై మరోసారి విమర్శలు కురిపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని