Telangana BJP: భాజపాకు 119 నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు: బండి సంజయ్‌

తెలంగాణలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భారత రాష్ట్ర సమితి (భారాస)కు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమే అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.

Updated : 28 Feb 2023 17:08 IST

దిల్లీ: కేంద్ర మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ భాజపా నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు  తెలంగాణలో భాజపా భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై నేతలు చర్చించారు. భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నేతలు మీడియాతో మాట్లాడారు.

‘‘తెలంగాణలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితి (భారాస)కు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమే అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో మేం చేపట్టిన కార్యక్రమాలపై జాతీయ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రజా గోస కార్యక్రమాలు, కార్నర్‌ మీటింగ్స్‌ పెట్టాం. త్వరలోనే ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. బహిరంగ సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉంది. భాజపాకు అభ్యర్థులు లేరనేది భారాస దుష్ప్రచారం మాత్రమే. 119 నియోజకవర్గాల్లో భాజపాకు బలమైన నేతలున్నారు. రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన భాజపా ప్రస్థానం నేడు 300 సీట్లు దాటింది. దిల్లీ లిక్కర్‌ కేసుకు, భాజపాకు సంబంధం లేదు. దిల్లీ లిక్కర్‌ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లిక్కర కేసు ఛార్జిషీట్‌లో కవిత పేరును సీబీఐ నాలుగు సార్లు పేర్కొంది. కవిత పేరు ప్రస్తావించినప్పుడు సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదు. సిసోదియా అరెస్టుకు, తెలంగాణ భాజపా రాజకీయాలకు సంబంధం లేదు’’  అని బండి సంజయ్‌  అన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని