‘అక్కడ న్యాయం.. ఇక్కడ అన్యాయమా?’

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని సీఎల్పీ నేత, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి...

Published : 06 Aug 2020 00:46 IST

తెరాస ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని సీఎల్పీ నేత, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులు గురించి గవర్నర్‌కు  ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కరోనా కారణంగా గవర్నర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వం చేసిన తప్పు వల్లే గజ్వేల్‌లో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. తెరాస అనే ఫ్యూడల్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయని భట్టి ఆరోపించారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే..
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో కరోనా విపరీతంగా విజృంభిస్తోందని భట్టి విమర్శించారు. పట్టణాల నుంచి పల్లెలకు కరోనా వ్యాప్తి జరిగిందన్నారు. ప్రజారోగ్యాన్ని ఇంత దారుణంగా గాలికి వదిలేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. కరోనాను నియంత్రించడానికి కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను.. కాంగ్రెస్‌ నేతలను కట్టడి చేయడానికి ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

పోతిరెడ్డిపాడుపై స్పందించాలి
రోజుకు 11 టీఎంసీలు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ లిఫ్ట్‌  చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో విడుదల చేస్తే సీఎం కేసీఆర్‌ నుంచి కనీస స్పందన లేదని భట్టి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు పూర్తయితే తెలంగాణలో 25లక్షల ఎకరాలు ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 5న అపెక్స్ భేటీకి పిలిస్తే సీఎం పట్టించుకోకుండా ఆగస్టు 20వ తేదీ తరువాత పెట్టమనడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. 20వ తేదీ లోపు పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వేయిమని చెప్పినట్లు ఉందని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసే సీఎంను ఇప్పటిదాకా చూడలేదని చెప్పారు. ఏపీకి న్యాయం చేస్తూ- తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 19వ తేదీలోపు ఏపీ చేసే టెండర్ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని