kcr-Nitish Kumar: ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల వేళ నిర్ణయిస్తాం: కేసీఆర్‌

కేంద్రంలోని భాజపా సర్కారును సాగనంపాల్సి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బిహార్‌ పర్యటనలో భాగంగా పట్నాలో ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్‌తో

Published : 01 Sep 2022 02:30 IST

పట్నా: కేంద్రంలోని భాజపా సర్కారును సాగనంపాల్సి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బిహార్‌ పర్యటనలో భాగంగా పట్నాలో ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్‌తో కలిసి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 8ఏళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని విమర్శించారు. భారత్‌ ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదని.. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పతనమైందన్నారు. రూపాయి విలువ ఈ స్థాయిలో ఎన్నడూ పతనం కాలేదని చెప్పారు. దేశంలోని రైతులు, పేదలు, మహిళలు.. ఇలా ఏ ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?

‘‘దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. సమృద్ధిగా జలాలు ఉన్నా జల యుద్ధాలు ఆగడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు పెరిగి పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వడం లేదు. దేశ రాజధాని దిల్లీలోనూ తాగునీరు, విద్యుత్‌ సమస్యను పరిష్కరించలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల హామీ ఏమైంది? సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా.. వినియోగించుకోవడం లేదు. బేటీ బచావో... బేటీ పడావో.. నినాదం ఉన్నా.. అత్యాచారాలు ఆగడం లేదు. దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? భాజపా ప్రభుత్వం మంచి చేస్తే రైతులు ఎందుకు ఉద్యమిస్తారు? మంచి దేశాన్ని నాశనం చేస్తున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం పేరుకు మాత్రమే. వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

రొటీన్‌ ప్రభుత్వాలు వద్దు..

‘‘భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలి. రొటీన్‌ ప్రభుత్వాలు వద్దు.. భారత్‌ను మార్చే ప్రభుత్వం కావాలి. భాజపా పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయింది. అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు. విపక్షాలను ఏకం చేసే విషయమై నీతీశ్‌తో చర్చించా. విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి క్షేమకరం కాదు. చైనాతో పోలిస్తే, మనం ఎక్కడ ఉన్నాం. విద్వేషం పెరిగితే దేశానికి నష్టం. ప్రతిష్ఠాత్మక సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేస్తారా? రైల్వే, ఎయిర్‌పోర్టులు.. ఇలా అన్నీ ప్రైవేటీకరిస్తున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.. చేశారా? నీతీశ్ కూడా భాజపా ముక్త్‌ భారత్‌ కోరుకుంటున్నారు.  భాజపాకు వ్యతిరేకంగా అందరం ఏకతాటిపై ఉన్నాం. ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల వేళ నిర్ణయిస్తాం. విస్తృత చర్చల ద్వారా నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటాం. ప్రజల మద్దతుతో భాజపా ముక్త్‌ భారత్‌ నిర్మాణం కోసం కలిసి రావాలని నీతీశ్‌ను కోరాం. భాజపా ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే. భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తాం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని