చేతకాదన్నారు.. చేసి చూపించాం: కేసీఆర్‌

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని కొంత మంది దుర్మార్గంగా వాదించారు.. కానీ, చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఇవాళ నిరూపించామని తెలంగాణ సీఎం కేసీఆర్‌

Updated : 04 Jul 2021 16:30 IST

సిరిసిల్ల: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని కొంత మంది దుర్మార్గంగా వాదించారు.. కానీ, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్‌శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఇవాళ నిరూపించామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. దాన్ని సాధించే దిశగా వెళ్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.64.70 కోట్లతో 93.33 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. జిల్లాలో కలెక్టరేట్‌ ఏర్పాటవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలుత మండేపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్, ట్రైనింగ్‌ రీసెర్చ్‌ కేంద్రం, నర్సింగ్‌ కళాశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయం రంగంలో అద్భుతాలు..

‘‘రాష్ట్రంలో గత ఆరేళ్లలో వ్యవసాయ రంగంలో అద్భుతాలు జరిగాయి. వ్యవసాయం చేసే పరిస్థితులు లేక వలసపోయిన అన్నదాతలు స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన మార్పు. తెలంగాణ తన పునాదిని మరోసారి బలంగా చేసుకుంటోందనే దానికి ఇదొక సంకేతం. రాష్ట్రంలో పండిన పంటలో 92 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చాం. గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రూ.8వేల కోట్లతో పథకాన్ని రూపొందించాం. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ.4వేల కోట్లను ఖర్చు చేసి గొర్రెల పంపిణీ చేపట్టాం. త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించబోతున్నాం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదలు పెట్టిన తొలి కార్యక్రమం మిషన్‌ కాకతీయ. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న చెరువులకు మరమ్మతులు చేసుకున్నాం. కొత్తవి తవ్వుకున్నాం. ఈ పథకంలో భాగంగా బాగుచేసుకున్న చెరువులు ఇప్పుడు నిండుగా ఉన్నాయి. రాష్ట్రంలో గత రెండేళ్లలో 135 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మిషన్‌ కాకతీయలో భాగంగా చేపట్టిన ఏ ఒక్క చెరువు గట్టు తెగలేదు. తెలంగాణ తనను తాను పునర్‌ నిర్మించుకున్న తీరు మిషన్‌ కాకతీయతోనే మొదలై కాళేశ్వరం ప్రాజెక్టు వరకూ వెళ్లింది. ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? లేదా?అని ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కొంత మంది రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ప్రాజెక్టును పూర్తి చేసి చూపించాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛను

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పింఛను ఇస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ‘‘గోదావరినే 500 మీటర్లు పైకి తెచ్చాం.. ఎస్సీలను పైకి తేలేమా?ఎస్సీల కోసం రాబోయే నాలుగేళ్లలో రూ.45వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. నర్సింగ్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచుతున్నాం. మొదటి సంవత్సరం నర్సింగ్‌ విద్యార్థులకు రూ.5వేలు. రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.6వేలు, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.7వేలు స్టైఫండ్‌ ఇస్తాం. వచ్చే విడతలో రాజన్న సిరిసిల్లకు కచ్చితంగా వైద్య కళాశాల వస్తుంది. జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాల కూడా మంజూరు చేస్తాం. త్వరలోనే రాజన్న ఆలయం స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. త్వరలో చేనేత కార్మికులు, మరమగ్గాల వారు మరణిస్తే రూ.5లక్షల బీమా. సిరిసిల్లలో కమ్యూనిటీ హాలు కోసం రూ.5కోట్లు మంజూరు చేస్తున్నా’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts