Congress: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ ట్వీట్లకు తెలంగాణ కాంగ్రెస్‌ కౌంటర్‌

మంత్రి కేటీఆర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మధ్య కొనసాగుతున్న ట్వీట్‌ వార్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది.

Published : 30 Mar 2023 22:40 IST

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మధ్య కొనసాగుతున్న ట్వీట్‌ వార్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది. ‘‘దొంగలు, దొంగలు తన్నుకుంటే చోరీ కథ బయటపడింది. విభజన చట్టాన్ని తుంగలోకి తొక్కి తెలంగాణను పట్టించుకోని పార్టీ ఒకటి.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని, కాంగ్రెస్‌ చట్టబద్ధత కల్పించిన హామీలను కూడా సాధించలేని చవట పార్టీ మరొకటి. ఇద్దరూ తోడు దొంగలే.. ఇద్దరూ తెలంగాణ ద్రోహులే’’ అని తెలంగాణ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ఇవాళ మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ చేసిన ట్వీట్లను జత చేస్తూ ఈమేరకు విమర్శలు చేసింది.

మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ 

‘‘తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని మోదీ చెప్పారు. మెట్రో రెండో దశ, ఐటీఐఆర్‌, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చేశారు. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను మోదీ అమలు చేయట్లేదు. వీటన్నింటికీ రాష్ట్రంలోని నలుగురు భాజపా ఎంపీలు బాధ్యత వహించాలి. తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ, ప్రధాని రాష్ట్రం గుజరాత్‌కు లోకోమోటివ్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి రూ.20వేల కోట్లు ఇచ్చారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితమిది’’ అని  మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌ ..

 తెలంగాణకు ఏమీ ఇవ్వని భాజపా, మోదీ మనకెందుకు అని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వనప్పుడు కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఎందుకు భరించాలి? సహించాలి? అని ప్రశ్నించారు. తన పార్టీ నుంచే తెలంగాణ పేరును తొలగిస్తే.. కేసీఆర్‌ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదని పేర్కొన్నారు. ఉద్యమకారులకు పార్టీలో చోటు, దళితులకు మూడెకరాలు, దళిత సీఎం, ఉద్యోగ  నియామకాలు , నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, పంచాయతీ, మున్సిపాలిటీలకు, ఆలయాలకు నిధులు ఇవ్వని కేసీఆర్‌ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదు? అని సంజయ్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని