TELANGANA : నిరుద్యోగులారా.. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : కాంగ్రెస్‌

ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలంటూ  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టింది. సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌ రావు క్యాంపు కార్యాలయాన్ని

Published : 29 Jan 2022 16:00 IST

హైదరాబాద్‌: ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలంటూ  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టింది. సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌ రావు క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ను ముట్టడించిన కార్యకర్తలు పైకి ఎక్కి కాంగ్రెస్‌ జెండాను ప్రదర్శించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నిరుద్యోగ యువత, రైతులకు అండగా గన్‌పార్క్‌ స్థూపం వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కోదండరెడ్డి తదితరులు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం విలేకర్లతో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత, రైతులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. ‘తెరాస ప్రభుత్వం వచ్చాక గత ఆరు సంవత్సరాల్లో పంట నష్టం చెల్లించారా?కౌలు రైతుల గురించి ఆలోచించారా? వరికి రూ. 550 మద్దతు ధరను రూ. 1500 చేసిన చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. మా ఆందోళన అధికారం కోసం కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానిపై చర్చకు రమ్మంటున్నాం’ అని పొన్నాల చెప్పారు. 

కరోనా సమయంలో వ్యవసాయ రంగం మాత్రమే పని చేసిందని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. మోదీ, కేసీఆర్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులు మంత్రుల కాళ్లు పట్టుకున్నారని, అయినా ఇంతవరకు అప్పులు నష్టపరిహారం చెల్లించలేదని చెప్పారు. నిరుద్యోగులు, రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని మౌన దీక్ష చేపట్టామని వివరించారు.

తెలంగాణ వస్తే భవిష్యత్‌ బాగుంటుందని భావించామని.. నిరుద్యోగ యువత, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. అమరవీరుల స్థూపం వద్ద మౌన దీక్షకు కూర్చుంటే సీఎం దగ్గర చలనం ఉంటుందనుకున్నామన్నారు. ఇక నుంచి ఎవరూ ప్రాణాలను తీసుకోవద్దని రైతులు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో అతిపెద్ద రైతు ఉద్యమం మన దేశంలోనే జరిగిందని మాజీ మంత్రి చంద్రశేఖర్‌ తెలిపారు. రైతులకు భరోసాగా కాంగ్రెస్‌ పోరాడుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని