Telangana News: కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరతా: జగ్గారెడ్డి

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయడంపై వ్యక్తిగతంగా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌కు

Published : 09 Mar 2022 15:16 IST

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయడంపై వ్యక్తిగతంగా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జగ్గారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 7 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వట్లేదని అనేక సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరఫున విమర్శించామని.. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు. ఈరోజు రాష్ట్రంలో మంచి పనులు జరుగతున్నాయంటే అందుకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే కారణమన్నారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌ను రీఓపెన్ చేయాలని కోరనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల మాదిరిగా ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు సాయం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం త్వరలోనే మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

తీవ్ర నిరాశకు గురి చేసింది: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి అన్నారని.. అది ఏమైందని ప్రశ్నించారు. హుజారాబాద్ ఎన్నికల సమయంలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం చెప్పినట్లు గుర్తు చేశారు. బిస్వాల్ కమిటీ ప్రకారం 1.91 లక్షల ఖాళీలు భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. అందుకే నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ప్రకటిస్తూ సీఎం క్షమాపణ చెప్పాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని