Revanth reddy: మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు చాలా కీలకం: రేవంత్‌రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అనుబంధ సంఘాల పాత్ర చాలా కీలకమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికతోపాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుబంధ

Published : 11 Aug 2022 17:13 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అనుబంధ సంఘాల పాత్ర చాలా కీలకమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికతోపాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు పట్టుదలతో పనిచేయాలని కోరారు. ఈ మేరకు గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన అనుబంధ సంఘాల ఛైర్మన్‌ల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక చాలా కీలకం. మనం పూర్తి స్థాయిలో కష్టపడి భాజపా, తెరాసలకు బుద్ధి చెప్పాలి. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారికి గుణపాఠం చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పని చేయాలి’’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సెమీఫైనల్‌: మధుయాస్కీ

భాజపా, తెరాస కుట్రలో భాగంగానే ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను పక్కనపెట్టి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస, భాజపాల మధ్యే పోటీ ఉందనే వాతావరణం తెచ్చేందుకు ఇరు పార్టీలు ఒప్పందంతో కొనసాగుతున్నాయన్నారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్‌ సెమీఫైనల్‌గా భావిస్తుందని.. ఈ పరిణామాలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కార్యకర్తలందరికీ ఆమోదయోగ్యమైన వారే మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉంటారని తెలియజేశారు.

‘‘ఈనెల 13న మునుగోడులో కాంగ్రెస్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. నియోజకవర్గ పరిధిలోని 175 గ్రామాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. 16 నుంచి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం. ఈనెల 20న జరిగే రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర నేతలంతా పాల్గొంటారు’’ అని మధుయాస్కీ తెలిపారు.

ఏఐసీసీ కార్యదర్శులకు పార్లమెంట్‌ వారీగా బాధ్యతలు.. 

* బోస్ రాజుకు:  నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల

* నదీమ్ జావిడ్ కు: హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, జహీరాబాద్, నిజామాబాద్‌, ఆదిలాబాద్

* రోహిత్ చౌదరికి: కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని