‘2021 రాజకీయం’.. పెగాసస్‌ చిచ్చు.. దీదీ హ్యాట్రిక్‌.. పంజాబ్‌లో కొత్త పొత్తు..

ఈ ఏడాది పార్లమెంటును కుదిపేసిన కొన్ని ఘటనలతోపాటు రాజకీయంగా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన కొన్ని అంశాలను చూద్దాం.

Updated : 29 Dec 2021 15:05 IST

ఓ వైపు కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఈ ఏడాది దేశవ్యాప్తంగా పలు అంశాలు ప్రధానంగా వార్తల్లో నిలిచాయి. ముఖ్యంగా ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే (పెగాసస్‌ హ్యాకింగ్‌) ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రైతుల ఉద్యమం, కనీస మద్దతు ధర, లఖింపుర్‌ ఖేరీ ఘటన, ఎంపీల సస్పెన్షన్‌ వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర ఒత్తిడి తెస్తూ నిరసనలు కొనసాగించాయి. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాలు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. ఇలా ఈ ఏడాది పార్లమెంటును కుదిపేసిన కొన్ని ఘటనలతోపాటు రాజకీయంగా దేశవ్యాప్తంగా ఆకర్షించిన కొన్ని అంశాలను చూద్దాం.

పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతం..

దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లో వినిపించిన ‘పెగాసస్‌’ స్పైవేర్‌ మరోసారి దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ స్పైవేర్‌ సాయంతో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే వార్తలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్, తృణమూల్‌ కాంగ్రెస్ అగ్రనేత, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్‌లో విపక్షాలు తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.


లఖింపూర్‌ ఖేరీ.. రైతులపై కారు దాడి

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తోన్న ఉద్యమంలో చోటుచేసుకున్న ఊహించని పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో నిరసన చేస్తోన్న రైతులపైకి భాజపా నేతలకు చెందిన కారు దూసుకెళ్లింది. ఆ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మరణించారు. ఈ ఘటనలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశీష్‌ మిశ్రా పాల్గొన్నారనే అభియోగాలపై ఆయనను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు బాధ్యతగా ఆయన తండ్రిని మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ ఇదే అంశంపై ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగించాయి. తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతోంది. ఇది సమయంలో లఖింపూర్‌ ఖేరీ ఘటన రైతులపై కుట్ర పూరితంగానే జరిగిందని తేలింది.


రైతుల ఉద్యమంపై ఆందోళన..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ఆందోళనలతో దేశరాజధాని అట్టుడుకిపోయింది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా వేల మంది అన్నదాతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ ఎర్రకోటకు చేరుకున్న రైతులు అక్కడ జెండాలు ఎగరవేశారు. అయితే, ఇలా రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో రైతుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టే ప్రణాళిక ఒకటి వెలుగు చూడడం సంచలనం సృష్టించింది. టూల్‌కిట్‌ పేరుతో బయటకు వచ్చిన ఈ వ్యవహారంపై రాజకీయంగా పెను దుమారమే రేగింది. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.


టూల్‌కిట్‌ వ్యవహారం..

దేశవ్యాప్తంగా రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతు పలికిన ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ కొద్దిరోజుల కిందట ఓ ‘టూల్‌ కిట్‌’ను విడుదల చేసింది. జనవరి 26న దిల్లీలో జరిగిన పరిణామాలను అందులో వివరించారు. రైతులపై దాడిని నిరసిస్తూ విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఎదుట, మీడియా కార్యాలయాల ఎదుట, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట, అంబానీ, అదానీల కార్యాలయాల ఎదుట ఎలా, ఎప్పుడు ఆందోళన చేపట్టాలో సూచిస్తూ ఓ ప్రణాళికను ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ ప్రణాళికను ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ‘టూల్‌ కిట్‌’ వెనక ఉన్నదెవరో గూగుల్‌ తదితర సంస్థల నుంచి సమాచారం సేకరించారు. గ్రెటాకు బెంగళూరులోని పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి మరికొందరు సహకరించినట్లు తేలడంతో వారిపై కేసులు నమోదుచేశారు. అనంతరం దిశ రవిని అరెస్టు చేశారు. రైతుల ఉద్యమం సమయంలో టూల్‌కిట్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.


వాడీవేడీగా శీతాకాల సమావేశాలు..

పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న విపక్ష పార్టీలు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ తమ ఆందోళనలు కొనసాగించాయి. ముఖ్యంగా సాగు చట్టాల రద్దుపై చర్చ, లఖింపుర్‌ ఖేరీ ఘటన సంబంధించి కేంద్ర మంత్రిని తొలగించడం, ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానం వంటి అంశాలను చర్చించేందుకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తూ రాజ్యసభ ఛైర్మన్‌ నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీటిని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో నిరసనకు దిగాయి. అయినప్పటికీ పలు కీలక బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.


మమతా.. వీల్‌ఛైర్‌ విజయం..

దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో బెంగాల్‌ పోరు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య జరిగిన హోరాహోరి పోరులో చివరకు మమతా బెనర్జీ విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకొని ప్రత్యర్థుల్ని మట్టి కరిపించినప్పటికీ తాను మాత్రం ఓటమి పాలయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన సువేందు అధికారిపై పోటికీ దిగిన దీదీ, ఆయనపై ఓడిపోయారు. అయినప్పటికీ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మే 5వ తేదీన ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ.. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలపర్చుకున్నారు.


పంజాబ్‌లో మారిన రాజకీయం..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పంజాబ్‌ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడి కాంగ్రెస్‌లో సంక్షోభం మొదలయ్యింది. అనంతరం నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ చన్నీ బాధ్యతలు చేపట్టారు. అయితే నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంపై కెప్టెన్‌ అమరీందర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తనను అవమానపరచిందన్న ఆయన పార్టీని వీడి ‘పంజాబ్ లోక్‌ కాంగ్రెస్‌’ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శిరోమణి అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనున్నట్లు ఇటీవలే పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి పలువురు నేతలు భాజపాలోకి అడుగుపెట్టడం గమనార్హం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని