
UP Polls: యూపీ ఎన్నికల వేళ.. ఆ ఫొటో వెనక వ్యూహమేంటో..?
దిల్లీ: కొద్ది నెలల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న వేళ.. ఓ చిత్రం అక్కడి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఫొటోలో కనిపిస్తోన్న వ్యక్తుల్లో ఒకరు ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాగా, ఒకరు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. దాంట్లో వారిద్దరు పక్కపక్కనే కూర్చోవడం కనిపిస్తోంది. దిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి ఇంట్లో జరిగిన రిసెప్షన్‌లో ఇరువురు కూర్చొని ఉన్నారు.
దీనిని కేంద్రమంత్రి అర్జున్ మేఘవాల్ ట్వీట్ చేశారు. దానిలో మంత్రి భగవత్‌ను ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించారు. ఇదిలా ఉండగా.. యూపీ మాజీ ముఖ్యమంత్రి, ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్ అనుచరుల ఇళ్లలో ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఈ సమయంలో ఈ ఫొటో వెలుగులోకి రావడం గమనార్హం. దీనిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. ‘‘కొత్త ఎస్పీ’లో ఎస్ అంటే సంఘవాదీనా..? అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు యూపీ భాజపా కూడా ట్వీట్ చేస్తూ.. ‘ఒక చిత్రం చాలా చెప్తుంది’ అంటూ రాసుకొచ్చింది.
సోమవారం జరిగిన రిసెప్షన్‌కు రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి .. ఇలా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. అంతమంది ఉన్నా.. యూపీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఈ చిత్రమే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కాంగ్రెస్ చేసిన విమర్శలకు ఎస్పీ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. ‘కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్‌సీపీ నేతలు కూడా నేతాజీ ( ములాయం సింగ్ యాదవ్) ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి కాంగ్రెస్ ఏం చెప్తుంది’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ఆ చిత్రాన్ని షేర్ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.