AAP Vs BJP: ‘మాన్‌ సాబ్‌.. మా పార్టీలో చేరాలంటే ఏం తీసుకుంటారు?

తమ పార్టీలో చేరితో డబ్బు, మంత్రిపదవి ఇస్తామంటూ ఓ పార్టీ తనకు ఎరవేసిందని ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడు, ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు.

Published : 05 Dec 2021 18:27 IST

ఆమ్‌ఆద్మీ ఎంపీ భగవంత్‌ మాన్‌ సంచలన ఆరోపణ

చండీగఢ్‌: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో తమ పార్టీలో చేరితే డబ్బు, మంత్రిపదవి ఇస్తామంటూ ఓ పార్టీ తనకు ఎరవేసిందని ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడు, ఎంపీ మాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, దాన్ని తిరస్కరించానని.. డబ్బు లేదా ఇతర ప్రలోభాలు చూపించి తనను కొనలేరని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ నేత పేరును మాత్రం సరైన సమయంలో వెల్లడిస్తానని ఆప్‌ ఎంపీ పేర్కొన్నారు.

‘మాన్‌ సాబ్‌.. భాజపాలో చేరాలంటే ఏం తీసుకుంటారు?’ అని నాలుగు రోజుల క్రితం ఓ భాజపా సీనియర్‌ నేత నాతో మాట్లాడారని పంజాబ్‌ ఆప్‌ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు భగవంత్‌ మాన్‌ ఆరోపించారు. ఒకవేళ భాజపాలో చేరితే కేంద్రమంత్రి పదవి ఇస్తామనే హామీకూడా ఇచ్చారని అన్నారు. అయితే, భాజపా ఎంపీ ప్రలోభాలను తిరస్కరించానన్న భగవంత్‌ మాన్‌.. డబ్బు లేదా మరో రూపంలో ఆశచూపి తనను కొనలేరనే విషయాన్ని స్పష్టం చేశానని మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా తాను కమీషన్‌ తీసుకునే వ్యక్తిని కాదని.. ఓ మిషన్‌లో భాగమనే విషయాన్ని సదరు భాజపా నేతకు తేల్చి చెప్పినట్లు వివరించారు. అయితే, ఆ భాజపా నేత ఎవరని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. సమయం వచ్చినప్పుడు ఆ పేరును బహిరంగ పరుస్తానని చెప్పుకొచ్చారు.

ఇక పంజాబ్‌లో భాజపాకు చోటు లేదన్న భగవంత్‌ మాన్‌.. ఇక్కడి గ్రామాల్లోకి ఆ పార్టీ నేతలు ప్రవేశించే పరిస్థితులు లేవన్నారు. ఇలా రైతులు ఆగ్రహాన్ని చూసే వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని