AAP: చండీగఢ్​ మున్సిపల్ కార్పొరేషన్​ ఫలితాలు.. ఇది ట్రైలర్‌ మాత్రమేనన్న ఆమ్‌ఆద్మీ

పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్​) సత్తా చాటింది. చండీగఢ్​ మున్సిపల్ కార్పొరేషన్​కు జరిగిన ఎన్నికల్లో 14 స్థానాల్లో......

Published : 28 Dec 2021 01:09 IST

చండీగఢ్​: పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్​) సత్తా చాటింది. చండీగఢ్​ మున్సిపల్ కార్పొరేషన్​కు జరిగిన ఎన్నికల్లో 14 స్థానాల్లో ఆప్ విజయం సాధించింది. శుక్రవారం ఎన్నికలు జరగగా సోమవారం కౌంటింగ్ నిర్వహించారు. చండీగఢ్​ మున్సిపల్ కార్పొరేషన్​లో మొత్తం 35 స్థానాలు ఉండగా.. ఆప్​ 14 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 12 స్థానాలు, కాంగ్రెస్​ 8 స్థానాలకు పరిమితమయ్యాయి. శిరోమణి అకాలీ దళ్​ ఒకే స్థానంతో సరిపెట్టుకుంది. చండీగఢ్ సిట్టింగ్ మేయర్​ రవికాంత్ శర్మ(భాజపా)ను ఆప్ అభ్యర్థి దమన్​ప్రీత్ సింగ్​ 828 ఓట్ల తేడాతో ఓడించడం గమనార్హం. మాజీ మేయర్, భాజపా అభ్యర్థి దావేశ్ మౌడ్గిల్‌పై ఆప్ అభ్యర్థి జస్బీర్ 939 ఓట్ల తేడాతో గెలుపొందారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘పంజాబ్​లో మార్పునకు ఇది సంకేతం. అవినీతి రాజకీయాలను ప్రజలు తిరస్కరించి ఆప్‌ని ఎన్నుకున్నారు. మాలాంటి చిన్న, నిజాయితీ గల పార్టీపై ఇంతటి ప్రేమ, నమ్మకాలను చూపించినందుకు ఆప్​, అరవింద్ కేజ్రీవాల్ తరఫున చండీగఢ్ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌ రాజకీయాలపై దృష్టిసారించిన ఆప్​కు దక్కిన మొదటి విజయం ఇది. గెలుపుపై ఆప్‌ నేతలు స్పందిస్తున్నారు. ‘చండీగఢ్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. పంజాబ్​ ఎలక్షన్లు అసలైన సినిమాను చూపిస్తాయి’ అని ఆ పార్టీ నేత రాఘవ్ చద్ధా పేర్కొన్నారు. పంజాబ్​లో తమ పార్టీకి ఘనమైన స్వాగతం లభించిందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని