
Punjab Lok Congress: అమరీందర్ సింగ్ కొత్తపార్టీ.. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం
దిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ (79).. నూతనంగా ఆయన పెట్టబోతున్న పార్టీ పేరు ప్రకటించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (Punjab Lok Congress)’ పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఏడు పేజీల లేఖను పంపించారు.
‘పార్టీ వ్యవహారాల్లో మీరు, మీ పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలు నాకెంతో బాధ కలిగించాయి. గడిచిన 52ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నన్నూ.. నా వ్యక్తిత్వాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. నేను ఇంతకాలం కొనసాగుతున్నానని.. నన్ను బయటకు పంపించాలని మీరు అనుకున్నారు. కానీ, నేను ఇంకా అలసిపోలేదు. నా ప్రియమైన పంజాబ్ కోసం చేయాల్సింది చాలా ఉందని భావిస్తున్నాను. ఓ సైనికుడిగానే ఉండాలనుకుంటున్నాను’ అని సోనియా గాంధీకి రాసిన లేఖలో అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీరును మరోసారి విమర్శించారు.
సైన్యంలో సేవలందించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ 1965 యుద్ధం తర్వాత బయటకు వచ్చారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన అమరీందర్ 1980లో కాంగ్రెస్ పార్టీ తరపున పటియాలా లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. 2002లో ఒకసారి, 2017లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది వరకు పదవీకాలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈమధ్యే సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్న ప్రకటించిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. పార్టీ పేరును ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’గా ఖరారు చేసినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.