Amarinder Singh: కాంగ్రెస్‌లో ఉండను.. భాజపాలోనూ చేరను..!

కెప్టెన్‌ అమరీందర్‌ భాజపాలో చేరడం లేదని.. అలాగని కాంగ్రెస్‌లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Updated : 30 Sep 2021 15:51 IST

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌

దిల్లీ: పంజాబ్‌ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కెప్టెన్‌ అమరీందర్‌.. తాను భాజపాలో చేరడం లేదని వెల్లడించారు. అలాగని కాంగ్రెస్‌లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలా పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న వేళ.. తన రాజకీయ భవిష్యత్తుపై అమరీందర్‌ సింగ్‌ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై మరింత ఆసక్తి నెలకొంది.

52ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఓ రోజు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు నాకు ఫోన్‌ చేసి రాజీనామా చేయమని చెప్పారు. అయినప్పటికీ తిరిగి నేను ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. ఆరోజు సాయంత్రమే గవర్నర్‌ వద్దకు వెళ్లి రాజీనామా చేశాను. యాభై ఏళ్ల తర్వాత నాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తనకు కాంగ్రెస్‌ పార్టీ కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించింది. ఇప్పటివరకు నేను పార్టీకి రాజీనామా చేయనప్పటికీ నమ్మకం లేని చోట నేను కొనసాగలేను’ అని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అయితే, భాజపాలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. భాజపాలో చేరడం లేదని వివరణ ఇచ్చారు.

ఇక నవజోత్ సింగ్‌ సిద్ధూకు కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించడాన్ని అమరీందర్‌ సింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయడాన్ని ప్రస్తావించిన అమరీందర్‌.. ఓ స్థిరమైన మనస్తత్వం లేని వ్యక్తి చేతిలో పార్టీ పగ్గాలు పెడితే ఇలాగే వ్యవహరిస్తారని అన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌తో  సరిహద్దు కలిగిన పంజాబ్‌ చాలా సున్నితమైన, సమస్యాత్మకమైన రాష్ట్రమని.. అటువంటప్పుడు సిద్ధూ వంటి నేతలతో దేశ భద్రతకు ముప్పేనని వ్యాఖ్యానించారు. ఇలా తాను కాంగ్రెస్‌లో కొనసాగనని ప్రకటించిన కొద్దిసేపటికే.. అమరీందర్‌ సింగ్‌ ట్విటర్‌ అకౌంట్‌ కూడా అప్‌డేట్‌ అయ్యింది. అంతకుముందు ట్విటర్‌ బయోలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తిగా పేర్కొనగా.. తాజాగా దాన్ని తొలగించడం గమనార్హం.

ఇదిలాఉంటే, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో బుధవారం సమావేశమైన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ గంటకుపైగా చర్చించారు. కేవలం వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధర వంటి అంశాలపైనే చర్చించినట్లు వెల్లడించారు. భాజపాలో చేరే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌తోనూ భేటీ అయ్యారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. పంజాబ్‌ సరిహద్దు భద్రతపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని