Punjab: ప్రధాని కాన్వాయ్‌ అడ్డగింత.. భగ్గుమన్న భాజపా, ఇతర పార్టీలు..!

కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనా విధానం, పనితీరుకు నేడు పంజాబ్‌లో చోటుచేసుకున్న ఘటన ఓ ట్రైలర్‌ మాత్రమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. 

Published : 06 Jan 2022 01:42 IST

కాంగ్రెస్‌ అగ్రనాయకులు క్షమాపణ చెప్పాలన్న అమిత్‌ షా

దిల్లీ: పంజాబ్‌ పర్యాటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని నిరసనకారులు అడ్డగించడంపై భాజపాతో పాటు ఇతర పార్టీలు మండిపడ్డాయి. ప్రధాని కాన్వాయ్‌ భద్రతా వైఫల్యానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ప్రజలు వరుసగా తిరస్కరిస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీ పిచ్చి మార్గంలో పయనిస్తోందని మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనా విధానం, పనితీరుకు నేడు పంజాబ్‌లో చోటుచేసుకున్న ఘటన ఓ ట్రైలర్‌ మాత్రమే. ప్రజల చేతిలో వరుసగా తిరస్కరణకు గురవుతోన్న కాంగ్రెస్‌ పార్టీ పిచ్చి మార్గంలో వెళుతోంది. నేడు చేసిన పనికి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకులు భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు.

సమాచారం ఎవరిచ్చారు..?

ప్రధాని మోదీ కాన్వాయ్‌కు ఎదురైన అవాంతరానికి పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ప్రయాణించే మార్గానికి తప్పుడు క్లియరెన్స్‌ ఎందుకు ఇచ్చారని పంజాబ్ డీజీపీని ప్రశ్నించారు. అంతేకాకుండా ఫ్లై ఓవర్‌పై నిరసన చేపట్టిన వారికి అసలు ప్రధాని రూట్‌ గురించి పంజాబ్‌ ప్రభుత్వంలో ఎవరు సమాచారం అందించారంటూ నిలదీశారు. ఇవి పంజాబ్‌ ప్రభుత్వంపై ఆరోపణలు కాదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అక్కడ చోటుచేసుకుంటున్న వాస్తవాలని స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ భద్రతా వైఫల్యంపై పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. పంజాబ్‌లో ఇది కచ్చితంగా శాంతిభద్రతల వైఫల్యమేనని.. ముఖ్యంగా సీఎం, రాష్ట్ర హోంమంత్రి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దేశ ప్రధానికి కార్యక్రమాలను సజావుగా సాగేలా చూడలేకపోతే పదవిలో కొనసాగే హక్కు సీఎంకు లేదన్నారు. పాకిస్థాన్‌ సరిహద్దుకు కేవలం 10కి.మీ దూరంలో ఈ ఘటన చోటుచేసుకుందని గుర్తుచేసిన ఆయన.. సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పదవి నుంచి తప్పుకోవాలన్నారు.

ఇదిలాఉంటే, ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటనలో నెలకొన్న అవాంతరంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  చన్నీ స్పందించారు. మోదీ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యాలూ లేవని స్పష్టంచేశారు. చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించడం వల్లే ఈ విధంగా జరిగిందని పేర్కొన్నారు. పంజాబ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందనడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని