Ap News: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

రాష్ట్ర విభజనతో ఏపీలో ఆర్థిక ప్రగతి తీవ్రంగా దెబ్బతిందని ఏపీ సీఎం జగన్‌ ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా.. కేవలం

Updated : 03 Jan 2022 19:51 IST

దిల్లీ: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రగతి తీవ్రంగా దెబ్బతిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా.. కేవలం 45 శాతం రెవెన్యూ మాత్రమే దక్కిందన్నారు. 2015-16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454గా ఉంటే.. ఏపీలో రూ.8,979 మాత్రమే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేసేందుకు ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన జగన్‌.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్‌ సమస్యలపై చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి జగన్‌ వినతి పత్రం అందించారు. మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ అయ్యారు.

‘‘భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌ పెద్దది. జనాభా కూడా ఎక్కువే. ప్రజల అవసరాలను తీర్చాలన్నా, వారికి సరైన సేవలు అందించాలన్నా.. అదే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుంది. విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది. మౌలిక సదుపాయాలను కోల్పోయాం. వాటి కోసం భారీగా ఖర్చు చేశాం. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతో పాటు అనేక హామీలు ఇచ్చారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది. కానీ, చాలా హామీలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి’’ అని ప్రధానికి వివరించారు.

పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయండి..

‘‘2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. ఏప్రిల్‌ 1, 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలియజేసింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు. అంతే కాకుండా అప్పటివరకు ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013 నాటి భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాల్సి ఉంటుంది. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ రూపంలో సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపాయి. ఈ విషయలలో మీరు జోక్యం చేసుకొని తగిన ఆదేశాలు ఇవ్వాలి. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2,100 కోట్ల పెండింగ్‌ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం.

కొత్త పద్ధతితో పరిమితమైన రిసోర్స్‌ గ్యాప్‌..

ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని అప్పటి ప్రధాని ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగే తేదీ నాటికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు తేదీకి మధ్యనున్న రిసోర్స్‌ గ్యాప్‌ను 2014-15 కేంద్ర బడ్జెట్‌ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. 2014 జూన్‌ నుంచి మార్చి 31, 2015 వరకు ఉన్న రిసోర్స్‌ గ్యాప్‌ మొత్తం రూ.16,078.76 కోట్లని కాగ్‌ నిర్ధారించింది. ఆ తర్వాత ప్రామాణిక వ్యయం పేరిట కేంద్ర ప్రభుత్వ కొత్త పద్ధతిని తీసుకువచ్చి రిసోర్స్‌ గ్యాప్‌ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. దీంతో నిధుల కొరత వల్ల 2014-15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులు, పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది. చాలా కాలంగా పెండింగులో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలి.

విద్యుత్‌ బిల్లులు చెల్లించేలా ఆదేశాలివ్వండి..

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ను సరఫరా చేసింది. జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 10, 2017 వరకు విద్యుత్‌ను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ విద్యుత్‌ పంపిణీ జరిగింది. దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయి. ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఇదే సమయంలో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్‌ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. దీని వల్ల ఏపీ విద్యుత్‌ సంస్థలు బలపడతాయి.

అర్హత ఉన్నా లబ్ధి పొందడం లేదు..

జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లేని విధానం వల్ల రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలో లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2.68 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 61 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లోని జనాభాలో 41 శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. అర్హత ఉన్న చాలా మంది జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధి పొందడం లేదు. అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్‌ ద్వారా అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపుతోంది. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకొని తగిన కేటాయింపులు చేయాలని కోరుతున్నాం.

పన్నుల ఆదాయం తగ్గుతూ వస్తోంది..

రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ఆ ఆదాయం దాదాపు 3.38 శాతం తగ్గింది. గత 2 దశాబ్దాల్లో కేంద్రం నుంచి వచ్చే పన్నుల ఆదాయంలో అతి తక్కువ నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌ మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోయింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు విపరీతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని కోసం భారత్‌ సహా ప్రపంచ దేశాలన్నీ భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. 2019-20 ఆర్థిక మందగమనం కూడా ఏపీపై ప్రభావం చూపింది. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి నుంచి పక్కకు వెళ్లలేదు. రాష్ట్ర భవిష్యత్తును ఉజ్వలంగా మార్చగల వైద్యం, విద్య, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు కుంటుపడకుండా అమలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని