MPTC-ZPTC: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు‌.. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)

Published : 17 Sep 2021 17:49 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓలు, జడ్పీ సీఈవోలతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాలకు సమీపంలో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇంఛార్జ్‌గా నియమించాలని కలెక్టర్లును ఆదేశించారు.

ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం తోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పర్యవేక్షణకు అదనపు బలగాలను  వినియోగించనున్నట్లు అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో నిరంతర నిఘా కోసం సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని