Botsa: ఆ భూములమ్మి చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తాం: బొత్స

లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు తిరగబడటంలో తప్పులేదని.. వారి ఆవేదనను అర్థం చేసుకున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

Published : 05 Nov 2021 15:00 IST

విజయనగరం: లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు తిరగబడటంలో తప్పులేదని.. వారి ఆవేదనను అర్థం చేసుకున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీ ప్రైవేటు యాజమాన్యం 2015 నుంచి ఇలాగే వ్యవహరిస్తోందని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో చెరకు రైతులు మంగళవారం తీవ్ర ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

‘‘2019లో రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.27కోట్లు బకాయి పడితే ఆర్‌.ఆర్‌.యాక్ట్‌ కింద 30ఎకరాలు అమ్మి బకాయిలు తీర్చాం. ప్రైవేటు యాజమాన్యంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఆనాడే చెప్పాను. షుగర్‌ ఫ్యాక్టరీ నుంచి దాదాపు రూ.10కోట్ల విలువైన 30వేల బస్తాల షుగర్‌ను స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం రూ.16కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిని ఎలా తీర్చాలనేదానిపై చర్చించాం. షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇంకా 24 ఎకరాలు ఉన్నాయి. ఆర్‌.ఆర్‌.యాక్ట్‌ కింద ఆ భూమిని కూడా త్వరలో అమ్మి రైతుల బకాయిలు చెల్లిస్తాం. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశాం.

రైతుల తొందరపడి మాట్లాడొద్దు. అధికారంలో లేని పార్టీల మాటలు వినొద్దు. మాది రైతు పక్ష పార్టీ.. వాళ్లకి మేలు చేసే కార్యక్రమాలే చేపడతాం. రాళ్లతో పోలీసులపై దాడి చేసినా వాళ్లు సంయమనం పాటించారు. కమ్యూనిస్టు పార్టీ ప్రోద్బలం, తెదేపా అండతో పోలీసులపై తిరగబడేట్టు చేశారు. ఏదోవిధంగా ఆందోళన సృష్టించాలని ప్లాన్‌ చేశారు. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో 80 వేల టన్నుల చెరకు దిగుబడి వస్తుంది. ఆ పంట కొనుగోలు ఎక్కడ చేపట్టాలో ఆలోచిస్తున్నాం’’ అని మంత్రి చెప్పారు.

అది తెదేపా రైతు పాదయాత్ర

రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రపై బొత్స స్పందించారు. అది తెదేపా రైతు పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా మేలు చేస్తోందన్నారు. రైతులకు కౌలు చెల్లించామని.. అలాంటప్పుడు పాదయాత్ర ఎందుకని మంత్రి ప్రశ్నించారు. అందుకే తెదేపా పాదయాత్ర అంటున్నానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని