AP News: పవన్‌ శ్రమదానం చూసి జనం నవ్వుకుంటున్నారు: కన్నబాబు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సరిగ్గా నిమిషంన్నర పాటు శ్రమదానం చేసి రోడ్డు వేసేసిన పవన్‌ కల్యాణ్‌ను చూసి అంతా నవ్వుకుంటున్నారని ఏపీ మంత్రి కన్నబాబు

Updated : 02 Oct 2021 17:53 IST

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సరిగ్గా నిమిషంన్నర పాటు శ్రమదానం చేసి రోడ్డు వేసేసిన పవన్‌ కల్యాణ్‌ను చూసి అంతా నవ్వుకుంటున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై ఏమని యుద్ధం ప్రకటించారో పవన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘‘వర్షాలు తగ్గిన తర్వాత రహదారుల మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారు. అందుకోసం రూ.2,200 కోట్లు కేటాయించారు. పవన్‌ కులాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ప్రభుత్వం కాపులను అణగదొక్కినట్టుగా ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. 12 ఏళ్లలో ఒక్కసారి కూడా శాసనసభ్యుడు కాలేకపోయానన్న బాధ పవన్‌ కల్యాణ్‌లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కులాల కుంపటి రాజేస్తామని చెప్పారు. చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారని అందరికీ అర్థం అయిపోయింది. జగన్‌ సీఎం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన పవన్‌ తన మాట మర్చిపోయారేమో. కోడికత్తి కేసని హేళనగా మాట్లాడుతున్న అంశం, వివేకా హత్య కేసులు.. ఒకటి ఎన్‌ఐఏ, మరొకటి సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ఆ కేసులపై అంత ఆసక్తి ఉంటే త్వరగా తేల్చాలని భాజపాని కోరాలి. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని వాళ్లే యుద్ధం గురించి మాట్లాడుతారు. కులం కార్డుతో ఏ ప్రభుత్వం కూడా విజయం సాధించలేదు. జగన్‌కు ఒక కులాన్ని ఆపాదించి లబ్ధిపొందాలని చూస్తున్నారు. పవన్‌ చెబుతున్న యుద్ధం ఎదో ఆయనే స్పష్టత ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఉంటున్న పవన్‌ కల్యాణ్‌కు ఇక్కడి పరిస్థితులు ఏం తెలుస్తాయి’’ అని మంత్రి కన్నబాబు విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని