Ap News: 3 రాజధానులపై కోర్టులో మొట్టికాయలు తప్పవనే వెనక్కి తగ్గిన వైకాపా: అశోక్‌గజపతిరాజు

మూడు రాజధానులపై కోర్టులో మొట్టికాయలు తప్పవని తెలిసే వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు

Published : 23 Nov 2021 01:59 IST

అమరావతి: మూడు రాజధానులపై కోర్టులో మొట్టికాయలు తప్పవని తెలిసే వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేక పోతుందని.. కేవలం కక్షపూరితంగానే ఆలోచనలు చేస్తూ పరిపాలనపై దృష్టి పెట్టడం లేదన్నారు. అస్థిరతను పెంచి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనలో రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదని.. ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తెదేపా హయాంలో అభివృద్ధిలో ముందుకెళ్లిన రాష్ట్రం ఇప్పుడు వెనకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరికీ నిబద్ధత లేదు. మంచి చేయాలన్న ఆలోచన వారికి లేదు. కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. వికేంద్రీకరణ అంటే విభజించడం కాదు. రెండేళ్లుగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. కొన్నింటిని చూస్తుంటే నాకే భయమేస్తోంది. కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక సమస్యను కప్పిపుచ్చుకొనేందుకు మరో పెద్ద సమస్యను సృష్టిస్తున్నారే తప్ప మరో ఆలోచన చేయడం లేదు. అన్ని వర్గాలను కించపరిచేలా, వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా  ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఎవరు మాట్లాడితే వారిపై విరుచుకుపడుతున్నారు. రెండు నాల్కలతో మాట్లాడటం ఏ ప్రభుత్వానికి తగదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ 2007 ఎకరాలలో కట్టాలని, ఎంఆర్ ఉండాలని, కార్గో ఉండాలని ఆలోచన చేసిన ప్రాజెక్టు. జగన్ వచ్చి అందులో ఐదు వందల ఎకరాలు తీసేసినట్లు చెప్పారు. దీని వలన ఉద్యోగ అవకాశాలు పోతాయని తెలీదా? మౌలిక సదుపాయాల కల్పన లేకుండా రంగులు వేస్తే అభివృద్ధి ఐపోయినట్టేనా?’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని