Atchennaidu: ఏపీలో ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం: అచ్చెన్నాయుడు

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వైకాపా నేతల చిట్టాను తాము బయటపెడితే వారిపై కేసులు నమోదు చేసే ధైర్యం డీజీపీకి ఉందా?..

Updated : 31 Aug 2021 15:40 IST

విజయవాడ: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వైకాపా నేతల చిట్టాను తాము బయటపెడితే వారిపై కేసులు నమోదు చేసే ధైర్యం డీజీపీకి ఉందా? అని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కరోనా ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి నిర్వహించిన బహిరంగసభలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెదేపా నేతలు కాలవ శ్రీనివాసులు, బీటెక్‌ రవి, లింగారెడ్డి, రాంగోపాల్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. 

తెదేపా నేతలు కాలు బయటపెడుతుంటే వైకాపా నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి, వైకాపా నేతల పాదయాత్రలు, నామినేటెడ్‌ పదవుల ప్రమాణస్వీకారాలకు అడ్డురాని కొవిడ్‌ నిబంధనలు.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై శాంతియుత నిరసన తెలిపిన వారికే వర్తింపజేయడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపితే అక్రమ కేసులు నమోదు చేయడం రాచరికాన్ని తలపిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం.. హిట్లర్‌, గడాఫీలను మించిన అరాచకం నడుస్తోంది తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని