AP News: 7 నెలల్లో తెదేపాకు 13 శాతం ఓటింగ్‌ పెరిగింది: అచ్చెన్నాయుడు

డబ్బు, అధికారం, పోలీసు బలగాలను ఉపయోగించి మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా గెలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Updated : 24 Sep 2022 15:40 IST

మంగళగిరి: డబ్బు, అధికారం, పోలీసు బలగాలను ఉపయోగించి మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా గెలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై   ఆయన స్పందించారు.

‘‘జగ్గయ్యపేట ఎమ్మెల్యే దౌర్జన్యంగా కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లి తెదేపా అభ్యర్థుల ఎన్నికను రద్దు చేయాలని అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ వైకాపా నేతలు మోహరించి తెదేపా తరఫున గెలిచిన అభ్యర్థులను బెదిరిస్తున్నారు. విశాఖపట్నంలో మోసం చేసి గెలిచారు. దాచేపల్లిలో తెదేపా తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరని ప్రగల్భాలు పలికారు. దాచేపల్లిలో అనేక ఇబ్బందులు పెట్టారు ఏమైంది. 11 వార్డుల్లో వైకాపా గెలిస్తే, తొమ్మిది వార్డుల్లో తెదేపా గెలిచింది. రెండు.. మూడు స్థానాల్లో ఫలితాలు తారుమారు చేశారు.  డబ్బు, అధికారం, పోలీసులు, వాలంటీర్లను ఉపయోగించి గెలిచారు. ప్రజలు వైకాపా వైపు ఉంటే ఎందుకు భయపడుతున్నారు. కుప్పంలో గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడంలేదు. ప్రభుత్వం, పోలీసులు, డబ్బు, మంత్రులు, ప్రతి ఒక్కరూ అక్కడే ఉండి దొంగ ఓట్లు వేయించి గెలిచారు. వైకాపా నాయకుల బెదిరింపులకు భయపడి బేతంచర్లలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి తెదేపా తరఫున ఒక్క నాయకుడు లేడు. ఇన్‌ఛార్జిని నియమించి అభ్యర్థులను పోటీలో పెడితే ఆరు స్థానాలు గెలిచాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత వార్డులో వైకాపా ఓడిపోయింది. ప్రజల్లో మార్పు మొదలైంది. 7 నెలల్లో తెదేపాకు 13శాతం ఓటింగ్‌ పెరిగింది. దమ్ముంటే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.. మళ్లీ మీరు గెలిస్తే పార్టీ మూసేస్తాం’’ అని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు