KCR: హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్‌: బీఏసీ సమావేశంలో కేసీఆర్‌

తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ముగిసింది.

Updated : 24 Sep 2021 14:14 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. 8 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలని తెరాస ప్రభుత్వం స్పీకర్‌కు ప్రతిపాదించింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్‌ నిర్మిస్తామని చెప్పారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ తరహాలో దీన్ని నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్‌ కచ్చితంగా పాటించాలన్నారు. ‘‘అభివృద్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలి. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశమైతే సమయం ఇవ్వాలి. కొత్తగా నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాలి. తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవాలి. సభ్యుల సంఖ్య తక్కువైనా విపక్షాలకు సమయం కేటాయిస్తున్నాం’’ అని కేసీఆర్‌ అన్నారు. 

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ చాలా అంశాలపై చర్చ చేపట్టాల్సి ఉందని.. 20 రోజుల పాటు అసెంబ్లీ జరపాలని కోరారు. ఈ మేరకు 12 అంశాలపై చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు జాబితా అందజేశారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ అన్ని పక్షాల నుంచి జాబితా రావాలన్నారు. ఆ జాబితాలు వచ్చాక పనిదినాలు నిర్ణయిద్దామని చెప్పారు. అయితే ప్రాథమికంగా సమావేశాలను అక్టోబర్‌ 5వరకు నిర్వహించాలని స్పీకర్‌ నిర్ణయించినట్లు సమాచారం. బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదని భాజపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని