Ts News: వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకే ప్రచారం: బండి సంజయ్‌

తెలంగాణలో మద్యాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్...

Published : 11 Dec 2021 14:42 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తాను మాట్లాడే భాషను మార్చుకోవాలని వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వానాకాలం వరి పంటను ఎందుకు కొనడం లేదని.. వర్షాకాలం పంటను కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఎక్కడా చెప్పలేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. తెరాస రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తారని చెబుతున్నారని.. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చినా భూసార పరీక్షలు ఎందుకు చేయడం లేదని నిలదీశారు.

పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని మోదీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్లనే పార్టీలో చేర్చుకుంటామని బండి సంజయ్‌ చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని.. పార్లమెంట్ సమావేశాల అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని