
Bandi Sanjay: ప్రధాని ఆవాస్ యోజన జాబితా ఎందుకివ్వట్లేదు?: బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరును తెరాస ప్రభుత్వం మార్చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నారని.. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే పథకం పేరును మార్చేశారని విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. కాంట్రాక్టర్ల కమిషన్ కోసమే ఇళ్లు కడుతున్నారని.. నాణ్యతను ఇప్పటి వరకు సీఎం పరిశీలించలేదని ఆరోపించారు.
ప్రధాని ఆవాస్ యోజన ఇళ్ల జాబితా ఇవ్వమంటే అభ్యంతరమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి పట్టించుకోవడం లేదని.. కేంద్రం నిధులను మాత్రం వాడుకుంటున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో భాజపా అధికారంలో ఉండగా సంవత్సర కాలంలో సుమారు 70వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి ఒకే రోజు గృహ ప్రవేశాలు చేశారని ఆయన గుర్తుచేశారు.