Ts News: ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది: బండి సంజయ్‌

కరీంనగర్ జైలు నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదలయ్యారు. కేంద్ర సహాయమంత్రి భగవంత్ కుభాతో కలిసి బండి సంజయ్‌ జైలు నుంచి బయటికి వచ్చారు

Updated : 06 Jan 2022 11:48 IST

కరీంనగర్: కరీంనగర్ జైలు నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదలయ్యారు. కేంద్ర సహాయమంత్రి భగవంత్ కుభాతో కలిసి బండి సంజయ్‌ జైలు నుంచి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా జైలు వద్దకు భాజపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌లోని భాజపా కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరును తప్పుబట్టిన హైకోర్టు ..వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన  జైలు నుంచి విడుదలయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘‘317 జీవోను సవరించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా. ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే జైలుకు వెళ్లా. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే భాజపా కార్యాలయం ధ్వంసం చేశారు.. కార్యకర్తలపై దాడి చేశారు. తొమ్మిది సార్లు లాఠీఛార్జి చేశారు. నన్ను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఉద్యోగులు భయపడొద్దు..హక్కుల కోసం పోరాడండి మీకు అండగా భాజపా ఉంటుంది. ఉద్యోగ సంఘాల నాయకులను నమ్మొద్దు.. వచ్చే ఎన్నికల్లో భాజపానే అధికారంలోకి వచ్చేది. 317జీవో సవరించకపోతే, అవసరమైతే మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధం. ఉద్యోగాలు పోతే అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. ధర్మయుద్ధం ఇప్పుడే  మొదలైంది. కేసీఆర్‌ నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్‌. బొడిగె శోభను ముందస్తు అరెస్టు ఎందుకు చేశారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుబట్టింది. రూ.వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారు. రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉంటే.. కేంద్రంలో భాజపా అధికారంలో ఉందని గుర్తు పెట్టుకోవాలి’’ అని హెచ్చరించారు. జైల్లో ఉండగా తనకు సంఘీభావం తెలిపి, అండగా నిలిచిన భాజపా కేంద్ర నాయకత్వానికి, పార్టీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బండి సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని