AP News: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదినగండమే: ఐవైఆర్‌ కృష్ణారావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదినగండంలా మారిందే తప్ప నూరేళ్ల ఆయుష్షు లేదని.. మున్ముందు ప్రతి నెలా జీతాలు, పింఛన్లు ఇవ్వడం  కష్టమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన

Updated : 19 Oct 2021 17:23 IST

విజయవాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదినగండంలా మారిందే తప్ప నూరేళ్ల ఆయుష్షు లేదని.. మున్ముందు ప్రతి నెలా జీతాలు, పింఛన్లు ఇవ్వడం  కష్టమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి, భాజపా నాయకులు ఐవైఆర్‌ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని, ఇలాంటి స్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. గృహనిర్మాణ పథకాల కొనసాగింపునకు సిమెంట్‌, ఇనుము డీలర్లతో ఓ ఆర్డీఓ సమావేశం నిర్వహించి తమకు అప్పుగా ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత సర్దుబాటు చేస్తామని కోరారని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు, పింఛన్ల చెల్లింపు ఆలస్యం సర్వ సాధారణంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారం, ఇతర పరికరాల కొరత, ఆదాయం కోసం విశాఖలో ఆస్తులు తాకట్టుపెడుతుండటం వంటివి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దంపడుతున్నాయని చెప్పారు.

రాష్ట్ర విభజన నాటికి రూ.86వేల కోట్ల రుణం ఉంటే.. ఈ ఏడేళ్లలో రూ.5లక్షల కోట్ల అప్పు పెరగడం ద్వారా మున్ముందు రుణాలు దక్కడమే కష్టమవుతుందని వివరించారు. మంచి నాయకత్వం అంటే ప్రజాసంక్షేమం ఉండకూడదని ఎవరూ అనడం లేదని, సంక్షేమాన్ని, అభివృద్ధిని రెంటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇవాళ ఎంత ముఖ్యమో.. రేపు అంతే ముఖ్యమనే విషయాన్ని రాష్ట్రప్రభుత్వంలోని పాలకులు విస్మరించారని ఆందోళన వెలిబుచ్చారు. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకు రాష్ట్ర అభివృద్ధిని తాకట్టుపెట్టుకుని పథకాల పేరిట విపరీతంగా పంచుతూ పోతే ఎదురయ్యే పర్యవసానాలు పరిగణనలోకి తీసుకోకపోవడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, 50శాతం తమ వాటాగా కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని పథకాలకు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణకు రైల్వే ప్రాజెక్టులు, ఇతర పథకాలకు రాష్ట్ర వాటా అందించకపోవడం వల్ల అవి ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని