AP News: రైతుల ‘మహాపాదయాత్ర’కు భాజపా మద్దతు.. యాత్రకు నేతలు

రాజధాని ప్రాంత రైతుల మహా పాదయాత్రకు భాజపా సంఘీభావం ప్రకటించింది. విజయవాడలో మీడియాతో మాట్లాడిన భాజపా

Updated : 21 Nov 2021 11:11 IST

విజయవాడ: రాజధాని ప్రాంత రైతుల మహా పాదయాత్రకు భాజపా సంఘీభావం ప్రకటించింది. విజయవాడలో మీడియాతో మాట్లాడిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రైతుల యాత్రకు భాజపా మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చేరుకున్న పాదయాత్రలో భాజపా రాష్ట్ర శాఖ తరఫున పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు ఇతర నాయకులు పయనమయ్యారు.

ఎంపీ సుజనా చౌదరి గన్నవరం విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఈ యాత్రకు బయలుదేరారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ కాజా నుంచి ఈ యాత్రలో పాల్గొంటుండగా.. మరో ఎంపీ సీఎం రమేష్‌ నేరుగా నెల్లూరు జిల్లా కావలి వద్ద నుంచి రైతులతో కలిసి నడవనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నదే తమ పార్టీ ఆలోచనగా పురందేశ్వరి, సోము వీర్రాజు తెలిపారు. రాజధాని చుట్టూ కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.. అభివృద్ధి చేస్తోందన్నారు.

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భాజపా పూర్తిగా కట్టుబడి ఉందని వారు తెలిపారు. ఇప్పటికే విభజన చట్టంలోని 90 శాతం హామీలను నెరవేర్చామన్నారు. ఎవరూ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విధాలుగా సహకరిస్తోందని తెలిపారు. అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని గతంలోనే పార్టీ తీర్మానం చేసి తమ అభిప్రాయాన్ని వెల్లడించామని వివరించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా రైతుల మహాపాదయాత్రలో పాల్గొంటూ వారికి మరింత అండగా నిలుస్తామని చెప్పారు. శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తోన్న అమరావతి ప్రాంత రైతులపై పోలీసుల ఆంక్షలు, దౌర్జన్యాలు సరికాదన్నారు. రాష్ట్రానికి భాజపా సహకరించడం లేదనే మాట అవాస్తవమని వారు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని